Ponnam Prabhakar: చేనేతల ఆత్మహత్యలు దురదృష్టకరమని, వారు ధైర్యం కోల్పోవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఏఐసీసీ ఇంచార్జీ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు భరోసా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాలో వీరు నేతన్నలను కలిశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ధైర్యం కోల్పోవద్దని, ఎన్నికల కోడ్ ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల జీవితాలు బాగుపడేలా కొత్త పాలసీ తెస్తామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే నేడు నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
గత పదేళ్లలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సిరిసిల్లలో పద్మశాలి సామాజిక వర్గానికి ఏం చేయలేదని దీపాదాస్ మున్షి విమర్శించారు. 26 వేల పవర్‌లూమ్స్, కార్మికులకు ఎలాంటి ఉపాధి చూపెట్టలేదని, పద్మశాలిలను రాజకీయంగా వాడుకున్నారని మండిపడ్డారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత బట్టలపై 12 శాతం జీఎస్టీ విధించిందని తెలిపారు. బతుకమ్మ చీరెల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. నాలుగు నెలల్లో ఐదుగురు కార్మికులు చనిపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. పాత పవర్‌లూమ్‌లు తీసేసి కొత్తవి ఏర్పాటుచేస్తామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కార్మికుల కోసం తమ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువస్తుందని వివరించారు. అన్ని విధాలుగా కార్మికులను ఆదుకుంటుందుని హామీ ఇచ్చారు.
Also Read: BRS: కేసీఆర్ పై కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు.. ‘బాధ్యత వహించాల్సిందే’
నేతన్నల ఆత్మహత్యలు దురదృష్ణకరమని రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆత్మహత్యలు వద్దు.. బతకడం ముద్దు అని నినదించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేవలం బతుకమ్మ చీరల మీద ధ్యాస పెట్టేదని అన్నారు. జీవో నెంబర్ 1 ద్వారా బట్టల ఆర్డర్‌లో గతం కంటే అదనంగా ఇచ్చేలా తమ పాలసీ ఉంటుందని, ఎన్నికల కోడ్ ఉండటం మూలంగా ఆ పాలసీ ఆగిపోయిందని వివరించారు. ప్రాడక్ట్ పెంచుతామని, వారికి ఎక్కువ పని కల్పిస్తామని, సిరిసిల్ల వస్త్రాలకు మార్కెటింగ్ చేయడానికి హైదరాబాద్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. చేనేత కార్మికులారా.. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పొన్నం సూచించారు. ఇది ప్రతిపక్షాలు చేసిన తప్పు అని అన్నారు. తాము తీసుకున్న నిర్ణయాల్లో సిరిసిల్ల నేతన్నల కోసం కార్యక్రమం లేదని, కానీ, త్వరలోనే వారికి మంచి పాలసీ తీసుకువస్తామని తెలిపారు.