Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ వాళ్లకు ఎన్నికలు వచ్చినప్పుడే రాముడు, హనుమాన్ జయంతి గుర్తుకు వస్తాయని చెప్పారు. మన తాత, ముత్తాతల నుంచి పండుగలు చేసుకుంటున్నామని, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలని చెప్పారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఫైరయ్యారు. పిచ్చోడు తిరనాళ్ళకి వెళితే ఎక్కిదిగడానికే సరిపోయింది అన్నట్టుగా కేసీఆర్ బస్సు యాత్ర జరుగుతోందని సెటైర్లు వేశారు.
మోదీ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని, ఈసారి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మెదక్‌లో నీలం మధుని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు. అందుకే, నీలం మధుని రాహుల్ గాంధీ మెదక్ నుంచి బరిలో నిలిపారని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారని విమర్శించారు. అలాగే, బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్‌లో వేలాది మంది రైతుల భూములను గుంజుకున్నారని ఆరోపించారు. భూములు గంజుకున్న వెంకట్రామిరెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసీఆర్, హరీష్ రావుకు వందల కోట్లు ఇచ్చినందుకే వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.