– నివేదిత, వెన్నెలకు సీటు లేనట్లేనా?
– అభ్యర్థుల ఎంపికపై పార్టీల సర్వేలు
– కాంగ్రెస్ పరిశీలనలో 4 పేర్లు
– కొత్త అభ్యర్థి అన్వేషణలో బీజేపీ
– పోటీపై గులాబీనేతల మల్లగుల్లాలు
Political Parties Not Giving Clarity On Cantonment By Election Contest: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో బాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికీ మే 13న ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. ఇప్పటివరకు లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన మీద దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం కంటోన్మెంట్ స్థానంలో తమ అభ్యర్థులను ఖరారు చేసే ప్రయత్నంలో పడ్డాయి. 2023 నవంబరులో జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎన్నికైన లాస్య నందిత ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సీటును తిరిగి తమ కుటుంబానికే కేటాయించాలని దివంగత సాయన్న కుటుంబ సభ్యులందరూ కేసీఆర్‌ను కోరటం, దానికి ఆయన సానుకూలంగా స్పందించటం జరిగిన నేపథ్యంలో సాయన్న మరో కుమార్తె నివేదిత ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగనుందనే వార్తలూ వచ్చాయి. అయితే, ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలై పక్షం రోజులు దాటినా, నేటి వరకు బీఆర్ఎస్ ఈ స్థానంలో తమ అభ్యర్థి గురించి ఏ ప్రకటనా చేయలేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల వేళ, ఈ సీటుకోసం బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ క్రిశాంక్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యమకారులు పోటీపడగా, అంతిమంగా ఆ సీటు సాయన్నకే దక్కింది. 2023లోనైనా సీటివ్వాలని క్రిశాంక్ గట్టిగా అడిగినా, ఆయనకు పార్టీ పదవి హామీ ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్ఠానం, దీనిని దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందితకు కేటాయించారు. లాస్య నందిత మరణం తర్వాత ఈ సీటుకు ఆమె సోదరి నివేదిత పేరు వినిపించింది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు నివేదిక పేరుకు మద్దతు తెలిపినా, ఈ సీటుకోసం గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె కృషాంక్‌లు పోటీకి రావటంతో సర్వే చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే, ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు నేపథ్యంలో ఈ సీటుకై పోటీపడిన నేతల్లో సగంమంది పోటీ ఆలోచన మానుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Read Also: ఒక వైపు పింఛన్ల పంచాయితీ జరుగుతుంటే.. ఉద్యోగాల గురించి వైసీపీ గొప్పలు
ఈ ఉప ఎన్నికల్లో ఈ సీటును గెలిచి తీరాలనే కసితో కాంగ్రెస్ పనిచేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల కేవలం 16 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావటంతో కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యంగా మారింది. తొలుత సాయన్న కుమార్తె నివేదితను కాంగ్రెస్ తరపున బరిలో దించాలని భావించిన కాంగ్రెస్, ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ నేత శ్రీగణేశ్‌ను పార్టీలో చేర్చుకుంది. అయితే ఈ సీటు విషయంలో శ్రీగణేష్‌తో బాటు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, పిడమర్తి రవి,సర్వే సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అరవ మాల సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటం, శ్రీగణేష్ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, బీజేపీలో ఉండగా అతనికి ఉన్న పరిచయాలూ కాంగ్రెస్ విజయానికి దోహదం చేస్తాయనే కోణంలోనూ కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఎంతమంది పోటీ పడినా, కాంగ్రెస్ సీటు తనకే వస్తుందని ప్రకటించిన గణేష్ ఇప్పటికే పరోక్షంగా ప్రచారమూ మొదలుపెట్టేశారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానంలో ఏకంగా 42 వేల ఓట్లు సాధించిన బీజేపీకి శ్రీగణేష్ నిష్క్రమణ తలనొప్పిగా మారింది. 2018, 2023 ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా నిలిచి పార్టీకి కొత్త జోష్ తీసుకొచ్చారు. అయితే, గత నెలలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవటంతో ఇప్పుడు బీజేపీకి బలమైన అభ్యర్థి కరువయ్యారు. దీంతో లోకల్‌గా ఉన్న నేతల్లో ఎవరో ఒకరిని బరిలో దింపాలని ఆ పార్టీ భావిస్తోంది.