Evidence: కేసు నిలబడాలంటే ఆధారాలు కీలకం. హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి రావడంతోనే కేసు వేగమందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆధారాలు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదివరకే ప్రణీత్ రావునే ఆ కోణంలో ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. తాజాగా హోంగార్డు, ఎలక్ట్రీషియన్‌లను పోలీసులు విచారించారు. వారి స్టేట్‌మెంట్లను విడిగా రికార్డు చేశారు.
ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారని, ఎలాంటి పరికరాలు ఉపయోగించారని, ధ్వంసం చేయడానికి ఎన్ని గంటలు లేదా రోజులు పట్టిందని పోలీసులు వారిని ప్రశ్నించారు. ఎస్ఐబీ కార్యాలయంలోనే ధ్వంసం చేశారా? లేక మరోచోటుకు వాటిని తీసుకెళ్లి ధ్వంసం చేశారా? ఆ పని డే టైమ్‌లో చేశారా? నైట్ టైమ్‌లో చేశారా? అని అడిగారు. ఎస్ఐబీ ఆఫీసులోకి ఎలక్ట్రిక్ కట్టర్ ఎలా తీసుకెళ్లారని? అప్పుడు సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? అని ప్రశ్నించారు. జనవరి 4వ తేదీన ఎస్ఐబీ కార్యాలయానికి ఎవరు రమ్మని పిలిచారని అని అడిగినట్టు తెలిసింది.
Also Read: ఓడిపోయినా వాస్తును వదలని కేసీఆర్!.. అప్పుడు సెక్రెటేరియట్, ఇప్పుడు తెలంగాణ భవన్
ధ్వంసమైన పరికరాలు దొరకకపోతే కేసు కొట్టివేసే ముప్పు ఉన్నది. అందుకే దర్యాప్తు వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తున్నది.
ముందుగా ఆధారాలు, సాక్ష్యాల కోసం ప్రణీత్ రావును పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తాను సాక్ష్యాలను ధ్వంసం చేశానని ప్రణీత్ రావు పోలీసులకు చెప్పారు. హార్డ్ డిస్క్‌లను కట్ చేసి మూసీ నదదిలో పడేసినట్టు వివరించారు. కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశానని ప్రణీత్ రావు పోలీసులకు వివరించారు. దీంతో ఆధారాలను సేకరించడం పోలీసులకు కష్టంగతా మారింది.
కంప్యూటర్ హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం వల్ల కిందపడ్డ శిథిలాలు లేదా రజనను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగోలు వద్ద మూసీ నదికి సమీపంలో హార్డ్ డిస్కులను పారేసిన చోటు నుంచీ స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసులో ఫైళ్లను తగులబెట్టిన సాక్ష్యాలనూ పోలీసులు సేకరించినట్టు సమాచారం.