– చిత్రపురిలో చిత్రవిచిత్రాలు
– డబ్బులు తీసుకుని ఇళ్లు కేటాయించని వైనం
– పోలీస్ కస్టడీకి కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్
– కూపీ లాగుతున్న పోలీసులు
– పరారీలో ఆరుగురు కమిటీ సభ్యులు
Police Takes Chitrapuri Colony Society President Anil Into Two days Custody : రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు రోజుకో వ్యవహారం వెలుగులోకి వస్తుంది. కానీ, చిత్రపురి కాలనీ చిత్రవిచిత్రాలు ఎన్ని తవ్వినా కొత్తవి బయటపడుతూనే ఉంటాయి. సినిమా వాళ్ల కోసమే కేటాయించబడిన ఈ కాలనీలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదులు, కోర్టు కేసులు, దర్యాప్తులు ఇలా ఎన్నో ఏళ్లుగా ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.
అసలేంటీ వివాదం?
మణికొండ ఏరియాలో ఉంటుంది ఈ చిత్రపురి కాలనీ. సినిమా వాళ్లకు ఇళ్ల కేటాయింపునకు సంబంధించి కమిటీ సభ్యులుగా పరుచూరి వెంకటేశ్వర్ రావు, వినోద్ బాల, చంద్ర మధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డితో పాటు పలువురు ఉన్నారు. చాలామందికి ఇళ్లు కేటాయించారు. కానీ, భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 160 మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఇళ్లు కేటాయించలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన వారంతా విసుగు చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటే ఫ్లాట్‌ను ఇద్దరు, ముగ్గురికి కేటాయించినట్టు బాధితులు చెబుతున్నారు. మాదాపూర్‌కు చెందిన తోట శ్రీపద్మ దగ్గర 12 లక్షలు తీసుకుని ఇల్లు అలాట్ చేశారు. కానీ, అదే ఫ్లాట్‌ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా చాలామందికి జరిగింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
రెండు రోజుల పోలీస్ కస్టడీ
చిత్రపురి కాలనీ స్కాంలో సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయగా, అందుకు న్యాయస్థానం అనుమతించింది. రెండు రోజుల పాటు అనిల్‌ను కస్టడీకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. అతని నుంచి కూపీ లాగుతున్నారు. ఈ స్కాంలో మిగతా సభ్యుల పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్లింది అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. భారీగా డబ్బులు చేతులు మారినట్టు గుర్తించారు. బాధితుల ఒక్కొక్కరి నుంచి 4 లక్షల నుంచి 40 లక్షల దాకా వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అనిల్‌తోపాటు వెంకటేశ్వర్ రావు, వినోద్ బాల, చంద్ర మధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డితోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఆరుగురు పరారీలో ఉన్నారు.