Lathi Charge: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టినప్పుడు జరిగిన తోపులాట పై రాజకీయ దుమారం రేగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారని, రైతుల అగచాట్లు మళ్లీ మొదలయ్యాయని బీఆర్ఎస్ విమర్శలు మొదలుపెట్టింది. హరీశ్ రావు, కేటీఆర్‌లు ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగా, కాంగ్రెస్ మాత్రం అక్కడ అసలు లాఠీ చార్జ్ జరగలేదని, విత్తనాలూ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నది. రైతులకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని వివరించింది. బీఆర్ఎస్, బీజేపీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడింది.
కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా? అని మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేశారు. రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం అని, సాగునీరు, కరెంట్ మాత్రమే కాదు పత్తి విత్తనాలను కూడా ప్రభుత్వం అందించలేకపోతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సి వచ్చిందని, రైతన్నలపై దాడి చేసినందుకు వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతన్నలపై దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక వైపు రాష్ట్రంలో రైతన్నలపై దాడులు జరుగుతుంటే సీఎం వేరే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండటం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. రైతన్నలపై లాఠీ చార్జ్ చేసిన అధికారులపై కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతన్నలపై దాడి చేస్తే బీఆర్ఎస్ ఊరుకోబోదని, అవసరమైతే విస్తృత నిరసనకు పార్టీ పిలుపు ఇస్తుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ మాత్రం లాఠీ చార్జ్ జరగలేదని, అదంతా బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారమేనని కొట్టిపారేసింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం భారీగా రైతులు తరలివచ్చిన మాట వాస్తవమేనని, కానీ, లాఠీ చార్జ్ జరగలేదని స్పష్టం చేశారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రతి రైతుకు కావల్సిన పత్తి విత్తనాలను అందిస్తామని, అన్నదాతకు అండగా ఉంటామని చెప్పారు. విత్తనాల కోసం ఆందోళన చెందవద్దని, అవి అందుబాటులో ఉన్నాయని వివరించారు.
డిమాండ్ రకం పత్తి విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారని, ఈ క్రమంలో రైతులు షాపులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం వివరించారు. దీంతో తోపులాట జరిగిందని, వారిని పోలీసులు చెదరగొట్టారని తెలిపారు. అంతేకానీ, లాఠీ చార్జ్ జరగలేదని చెప్పారు.