– 75 ఏళ్ల వెంకయ్య జీవితం ప్రజలకే అంకితం
– జననేతగా, సభాపతిగా ఆయన సేవలు భేష్
– వెంకయ్య జీవితంపై వచ్చిన 3 పుస్తకాల ఆవిష్కరణ
– వర్చువల్ మీట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ
హైదరాబాద్, స్వేచ్ఛ: సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, బీజేపీలో ప్రాథమిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి.. భారత ఉప రాష్ట్రపతి వరకు ఎదిగిన ముప్పవరపు వెంకయ్య నాయుడి జీవితం అందరికీ ఆదర్శమని ప్రధాని మోదీ కొనియాడారు. ఆదివారం వెంకయ్య నాయుడి 75వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య జీవితంపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జులై 1వ తేదీతో వెంకయ్యనాయుడికి 75 ఏళ్లు నిండనున్నాయి. తన జీవిత కాలంలో ఆయన అపూర్వమైన విజయాలను సాధించారు. ఆయన జీవితం మీద వచ్చిన పుస్తకాలను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరినీ సరైన మార్గంలో నడిపేందుకు ఈ పుస్తకాల్లోని అంశాలు దారి చూపుతాయి’ అని ప్రశంసించారు.
వెంకయ్య నాయుడి సంభాషణా చాతుర్యం, అప్పటికప్పుడు ఆశువుగా ప్రసంగించే ఆయన శైలి గురించి ప్రధాని ప్రస్తావించారు. బహిరంగ సభల్లో వెంకయ్య వాగ్ధాటికి ఎవరూ ఎదురు నిలబడలేరని కితాబిచ్చారు. ఆయన ఆలోచనల్లోని లోతు, భవిష్యత్ పట్ల స్పష్టత ఆ ప్రసంగాల్లో కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు సుమారు ఏడాదిన్నర పాటు జైలులో గడిపారని గుర్తుచేశారు. రాజ్యసభ చైర్మన్‌గా ఆయన సభను నడిపిన తీరు, 370 అధికరణం ఎత్తేసినప్పుడు సభను నియంత్రించిన పద్ధతిని ఆయన ప్రశంసించారు.
ముందు.. మాతృభాషే..
ఆ తర్వాత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధానిగా దేశానికి మేలు చేసే దిశగా మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని, సమాజంలోని అణగారిన వర్గాలు, పేదల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తన పుస్తకాలను ఆవిష్కరించినందుకు ఆయన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ భాషలపై తన మమకారాన్ని వెంకయ్య మరోమారు వెల్లడిస్తూ.. తాను ఆంగ్లానికి వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. ఇకనైనా, ప్రభుత్వ ఆదేశాలన్నీ ప్రాంతీయ భాషల్లోనే ఉండే ప్రయత్నం జరగాలన్నారు. కేంద్రం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించటం మంచి విషయమన్నారు. యువతలోని సామర్థ్యాలను గుర్తించి, మంచి శిక్షణ ఇప్పిస్తే వారు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, ఈ దిశగా మరింత ప్రయత్నం చేయాలని ప్రభుత్వాలను కోరారు.
Shri @MVenkaiahNaidu Garu’s wisdom and passion for the country’s progress is widely admired. https://t.co/MdfATwVa4f
— Narendra Modi (@narendramodi) June 30, 2024
వద్దనుకుంటే వెళ్లొచ్చు..
చట్టసభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని, తానున్న పార్టీ వైఖరి నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే, ఆ పార్టీ ద్వారా తనకు సంక్రమించిన పదవిని వదిలి వెళ్లాలని సూచించారు. రాజకీయ పార్టీల నేతలు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారి కోసం నియమావళి రూపొందించాలని సూచించారు. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి నేతలంతా ఉమ్మడిగా ప్రయత్నించాలన్నారు. కులం, ధనం ప్రభావం రాజకీయాల్లో తగ్గిపోవాలని లేకుంటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని హెచ్చరించారు.