– మోదీ సహా పలువురు ఎంపీల ప్రమాణం
– రాజ్యాంగంపై దాడిని సహించం: రాహుల్ గాంధీ
PM Narendra Modi: 18వ లోక్ సభ తొలి సమావేశం ప్రమాణ స్వీకారాలతో సోమవారం మొదలైంది. తొలి రోజున నరేంద్ర మోదీ, తెలంగాణ నుంచి కేంద్రమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సహా పలువురు ఎంపీలు ప్రమాణం తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయమే బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. ఆయన పార్లమెంటులో ఎంపీలతో ప్రమాణం చేయించారు. కాగా, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరిని ఎంచుకోవడాన్ని నిరసించాయి. ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్‌ను కాకుండా ఏడు సార్లు గెలిచిన బీజేపీ ఎంపీ భర్తృహరిని ఎన్నుకోవడం పార్లమెంటు సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని విమర్శించాయి.
ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధాని మోదీ పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఒక మచ్చ వంటిదని, ఆ చీకటి రోజులను తాను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని తొక్కేశారని, రాజ్యాంగాన్ని తొలగించారని కామెంట్ చేశారు. ఆ తర్వాత విపక్షాలు పార్లమెంటులో ఆవరణలో ఆందోళనకు దిగాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా సహా ఎవరైనా సరే రాజ్యాంగంపై దాడి చేస్తామంటే సహించేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అందుకే తాము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని వెళ్లామని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. రేపు కూడా మిగిలిన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ మరుసటి రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తర్వాతి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. జులై 3వ తేదీ వరకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.