Gaza War: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొందరు ఇంటర్వ్యూలతో ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ముస్లింలపై ద్వేషం లేదని నిరూపించుకునే ఉదాహరణలు ఇచ్చారు. గతంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ స్వయంగా జోక్యం చేసుకుని తాత్కాలికంగా నిలిపేశారని వార్తలు వచ్చాయి. తాజాగా గాజా యుద్ధాన్ని కూడా తాను ఆపించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నాయి.
గాజా యుద్ధం గురించి ప్రధాని మోదీ తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అది రంజాన్ మాసం. ముస్లింలకు పవిత్రమైన మాసం. కాబట్టి, కనీసం ఈ మాసం వరకైనా గాజాపై బాంబులు వేయకుండా ఆపాలని అనుకున్నాం. నా స్పెషల్ ఎన్వాయ్‌ను ఇజ్రాయెల్‌కు పంపించాను. ఈ విషయాన్ని చెప్పించాను. తన మాటను పాటించడానికి ఇజ్రాయెల్ శాయశక్తులా ప్రయత్నించింది. ఒకట్రెండు రోజులు మినహాయిస్తే రంజాన్ మాసంలో గాజాపై బాంబులు పడలేవు. కానీ, ఇవన్నీ చెప్పుకోను. ఈ విషయాన్ని ప్రమోట్ చేయాలని అనుకోలేదు. కానీ, ఇక్కడేమో నేను ముస్లిం వ్యతిరేకి అని ఆరోపణలు గుప్పిస్తుంటారు’ అని వివరించారు.
Also Read: Prabhas: వదిన వస్తోందంటూ పోస్ట్
ఇందుకు సంబంధించిన కామెంట్ల వీడియోను పోస్టు చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి మోదీపై విమర్శలు చేశారు. అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని.. ఇప్పుడు గాజా యుద్ధాన్ని కూడా మోదీ ఆపారంటా.. ఎంతటి అబద్ధాలు ఆడుతున్నారో.. అంటూ కామెంట్ చేశారు. ఎన్నికల ప్రమోషన్‌లో బీజేపీ విడుదల చేసిన ఓ వీడియోలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించి భారత విద్యార్థులను స్వదేశానికి తెచ్చినట్టూ చూపించారు. ఈ వీడియోనూ గుర్తు చేస్తు బీజేపీ పై ట్రోల్ చేస్తున్నారు.
ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులు చిక్కుకున్నప్పుడు భారత్ ఆపరేషన్ గంగా మిషన్ ప్రారంభించింది. అయితే.. విద్యార్థులను సరిహద్దు దేశాల వరకు రావాలని సూచించి.. ఆ దేశాల నుంచి స్వదేశానికి తీసుకువచ్చింది. ఆ సమయంలోనూ విద్యార్థుల తరలింపు కష్టం కావడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడి తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేశారని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.