– ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా పోలీసుల పాత్ర
– ఇప్పటిదాకా పట్టుకున్నది 10 శాతమేనా?
– కాంగ్రెస్ ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిన సీఐకి పోస్టింగ్ ఎలా?
– ఎర్రబెల్లి విశ్వాసపాత్రుడు విశ్వేశర్ అన్నదమ్ములిద్దరికీ పోస్టింగులు!
– ఎస్ఐబీ నుంచి ఇంకా బీఆర్ఎస్ నేతలకు సమాచారం అందుతోందా?
– దర్యాప్తులో తెరపైకి మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు
– అన్నీ తెలిసిన ట్రబుల్ షూటర్‌కి ట్యాపింగ్ ఉచ్చు
– తప్పించుకునేందుకేనా ప్రజా ఉద్యమ నాటకాలు
– అడిషనల్ ఎస్పీల అరెస్టుతో ఇంట్రస్టింగ్‌గా ట్యాపింగ్ కేసు
Phone Tapping This is just a trailer.!Picture Abhi Baaki Hai : ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్దీ సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ శాఖలో కీలకంగా ఉన్న అధికారుల పేర్లు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రుల లింక్స్ సైతం పోలీసులకు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజురోజుకీ కేసు ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇప్పటికే ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు తెరపైకొచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
కష్టాల్లో గులాబీలు.. సైడ్ అవుతున్న అధికారులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈనాటిది కాదు. గతంలో ఎన్నో ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం పెగాసిస్ వ్యవహారం పెద్ద సంచలనం అయింది. ప్రతిపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. గతంలో అయితే, సీఎం పదవులను సైతం పోగొట్టుకున్న సందర్భాలున్నాయి. ఎన్నో ప్రభుత్వాలు న్యాయస్థానాల్లో వివరణ ఇచ్చుకున్నాయి. అనేక ఇబ్బందులను చవిచూశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే దారిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. విచ్చలవిడి వ్యవహారమే గులాబీ నేతలకు చిక్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుటుంబంలో చిచ్చులు కూడా పెట్టిస్తోందని, సాటి మనిషిని నమ్మేలా లేకుండా చేస్తోందని అనుకుంటున్నారు. దీంతో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా గంట ప్రశాంతంగా బతుకలేని పరిస్థితిలో బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కానీ, ఆఫీసర్స్ మాత్రం తమ దారి తమదనేలా వ్యవహరిస్తున్నారు. పట్టుబడ్డవారు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఫాలో అయ్యామని చెబుతుంటే, మిగిలిన వారు కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకుంటూ పోస్టింగులు కొట్టేస్తున్నారు.
ఇప్పటికీ నల్గొండకు చేరుతున్న సమాచారం
కాంగ్రెస్ నేతల మూవ్ మెంట్ తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను గట్టిగా వాడేశారు. అప్పటి ప్రతిపక్ష నేతలు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవర్ని కలుస్తున్నారు? ఇలా సమాచారమంతా చేతిలో పెట్టుకుని కథ నడిపించారు. మహబూబ్ నగర్, నల్గొండ కాంగ్రెస్ నేతల ఫోన్స్ ట్యాప్ చేసేందుకు నల్గొండలోని ఓ ఉడిపి హోటల్ పైన పెట్టిన వార్ రూం మరిచిపోయారు. అయితే, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు విని బ్లాక్ మెయిల్ చేసి పోస్టింగ్ ఇప్పించుకున్నాడట ఓ ఎస్ఐబీ అధికారి. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ నివేదిక మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి రోజూ చేరుతోందనే అనుమానం పోలీసుల్లో ఉంది.
దయాకర్ దగ్గరి పోలీసులకు పోస్టింగులు
ఫోన్ ట్యాపింగ్‌లో ఇద్దరు మాజీ మంత్రులకు ఉచ్చు బిగుసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరికి సహకరించారని అనుమానిస్తున్న సీఐకి హన్మకొండలోని మంచి ఏరియాలో, మరో సోదరుడికి నర్సంపేటలో పోస్టింగులు దక్కాయి. దీనికి స్టేషన్ ఘన్ పూర్‌కి చెందిన కాంగ్రెస్ నేత చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ లాబీయింగ్ ట్యాపింగ్ ఎఫెక్ట్ వల్ల జరిగిందా? లేక, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఇంకా బయటపడని ఆఫీసర్స్ వీళ్లేనా?
ఎస్ఐబీలో పని చేసిన ధనంజయ్ గౌడ్, సుదర్శన్, శివకుమార్, వేణుగోపాల్ రావు, నర్సింగ్ రావు, రఘునందన్ రావులతో పాటు రమేష్, సురేందర్ రెడ్డి ఉన్నారు. ఇంకా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసిన అడిషనల్ ఎస్పీ సందీప్ రావు, శృతి, రాధా కిషన్ రావులు ఉన్నారు. అమెరికాకు వెళ్లిన తాటిపర్తి ప్రభాకర్ రావు, రాధా కిషన్, ఐ న్యూస్ ఎండీ శ్రావణ్ రావుల పాత్ర ఇంకా బయటపడాల్సి ఉంది. ఎంతోమంది ఉసురు తీసుకున్న ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులకు ఇన్వెస్టిగేషన్ టీం లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
-దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)