Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతంగా సాగిస్తున్నారు. అరెస్టు చేసిన పోలీసు అధికారుల వాంగ్మూలాల్లో కొందరు రాజకీయ నాయకుల పేర్లూ ఉన్నట్టు తెలిసింది. నిందితులైన పోలీసు అధికారుల విచారణ ఇప్పటికి పూర్తయిన నేపథ్యంలో తదుపరిగా రాజకీయ నాయకులను విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు న్యాయపరమైన ఇబ్బందులు, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి ముందుగా నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తులు జరుపుతున్నట్టు సమాచారం.
గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలిసింది. 25 మంది సమర్థవంతమైన అధికారులతో 2018లో ఓ టీం ఏర్పాటు చేశారని, ఆ టీం రేవంత్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా మారిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శల వాడి పెంచారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపైనా ఈ టీం నిఘా పెట్టిందని, రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ఈ టీం షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. నిఘా రిపోర్టును ఆ టీం ప్రణీత్ రావుకు అందిస్తే.. ఆయన ప్రభాకర్ రావుకు అందించేవారు.
Also Read: కర్ణాటకలో కమల విలాపం.. బీజేపీకి ఎదురుగాలి!
కాంగ్రెస్‌కు విరాళాలు ఇస్తున్నవారిని, రేవంత్ రెడ్డిని కలుస్తున్న, ఆయన పార్టీకి సహకరిస్తున్న వ్యాపారులను అధికారులతో గత ప్రభుత్వం బెదిరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గతంలోనే రేవంత్ రెడ్డి వెల్లడించారు. తమకు సహకరిస్తున్న శ్రేయోభిలాషులను, వ్యాపారులను అధికారులు బెదిరిస్తున్నట్టు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ విషయాలు బయటికి వస్తున్నాయి.
ఈటల రాజేందర్ పైనా నిఘా వేసినట్టు తెలిసింది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత ఆయనపై నిఘా పెట్టినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ పలుమార్లు వెల్లడించారు.
Also Read: అసలుకే ఎసరు.. జనసేన లక్ష్యంగా కొత్త పార్టీ
ఈ నేపథ్యంలోనే కీలక నిందితుల వాంగ్మూలాల ఆధారంగా రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారులు ఆలోచిస్తున్నారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని ఈ రోజు లేదా రేపు నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తున్నది.