- ప్రణీత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
- ఈనెల 21కి వాయిదా
- హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Phone Tapping Judgment reserved : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిక్కుకున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రణీత్ ఈ పిటిషన్ వేశాడు. ఆయన తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్‌ని ఆక్రమంగా అరెస్ట్ చేశారని వాదించారు.
నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారని వాదించారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 వరకు విచారిస్తున్నారని, నిజానికి, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇది జరగాలని, కానీ, అలా జరగడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెకప్ చేయించాలని, కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు లీక్ చేస్తున్నారని తెలిపారు.
Read Also : సారు.. కారు..రేసులో ఆఖరు
కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యిందని, పోలీస్ స్టేషన్‌లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పారు. ఇటు, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మీడియాకు ప్రణీత్ వ్యవహారంలో ఎలాంటి లీకులు ఇవ్వడం లేదన్నారు. ఆయన అరెస్ట్ తరువాత డీసీపీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని తెలిపారు. మీడియా రాస్తున్న వాటికి తాము బాధ్యులం కాదని, కేసు తీవ్రత దృష్ట్యా స్పెషల్ టీం ను ఏర్పాటు చేసామని వివరించారు.
బంజారాహిల్స్ సీఐ కూడా టీం లో ఉన్నారని, అందుకే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రణీత్‌ను విచారిస్తున్నట్టు చెప్పారు. అడిషనల్ ఎస్పీ రమేష్ దర్యాప్తులో పాల్గొనడం లేదని, ఆయన అసలు బంజారాహిల్స్ పీఎస్‌కు రానే లేదన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ టీంలో ఉన్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది.ఇరు తరఫు వాదనల అనంతరం తీర్పు రిజర్వ్‌లో పెట్టింది న్యాయస్థానం. ఇవాళ తీర్పు ప్రకటించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.