– ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమైన చర్య
– ప్రభుత్వ వ్యవస్థను తప్పుడు మార్గాన వాడుకోవడం దారుణం
– కేటీఆర్, హరీష్ రావు సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్
– స్పీకర్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
– అసెంబ్లీ నుంచి వారిని బహిష్కరించాలి
– టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కీలక వ్యాఖ్యలు
Congress: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లను విచ్చలవిడిగా ట్యాప్ చేశారు. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అధికారులతో పని చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ నిందితుల కన్ఫెషన్ రిపోర్టుల ద్వారా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది.
తాజాగా గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్. మాజీ డీసీపీ విచారణలో సంచలన విషయాలు బయట పడ్డాయని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. నిఘా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను ఎలా తప్పుదారిన వాడుకున్నారో దీన్నిబట్టి అర్థం అవుతోందన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించడమే కాకుండా ప్రత్యేక పరికరాలు తెప్పించి ట్యాపింగ్‌కు పాల్పడడం దారుణమని మండిపడ్డారు.
స్పీకర్ ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించి వీటిపై చర్చించి, వారిని అసెంబ్లీ నుండి బహిష్కరించాలని కోరుతున్నామన్నారు. అలా చేస్తేనే ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎవరూ సాహసించరని నిరంజన్ వ్యాఖ్యానించారు.