– రగులుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
– డీజీపీకి కొనసాగుతున్న నేతల ఫిర్యాదులు
– కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం దారిలోనే బీజేపీ నేత రఘునందన్
– డీజీపీని కలిసి ఫిర్యాదు
– నెక్స్ట్ బయటకొచ్చే లీడర్ ఎవరు..?
Phone Tapping case : పార్లమెంట్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొలిటికల్ హీట్‌కు దారి తీస్తోంది. బీఆర్ఎస్ పెద్దల ఆర్డర్‌తోనే ఈ వ్యవహారం నడించిందని ఇతర పార్టీల నేతలు చెబుతున్నారు. తాము కూడా బాధితులమేనని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ ఫిర్యాదుల బాట పట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి డీజీపీ రవి గుప్తాను కలిసి తనకు జరిగింది చెప్పుకోగా, తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా అదే చేశారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లి, తన ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు.
రఘునందన్ వాదన ఇదే..!
తెలంగాణలో ఉత్కంఠ రేపిన ఉప ఎన్నికల్లో దుబ్బాక ఒకటి. 2020లో అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అప్పటికి కాంగ్రెస్ ప్రాభవం తగ్గడంతో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని భావించి రఘునందన్ రావుకు పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు. అయితే, తనను ఓడించేందుకు కేసీఆర్ చేయరాని పనులన్నీ చేశారని ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు రఘునందన్. అందులోభాగంగానే తన ఫోన్‌ను ట్యాప్ చేశారని తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్‌ను చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేసి ప్రచార తీరు తెన్నులను తెలుసుకుని ఇబ్బందులకు గురి చేసినట్టు ఆరోపించారు. వీరితోపాటు అప్పటి డీజీపీని కూడా ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని కోరారు. ఉద్యమకారులు, సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నారంటే..!
రఘునందన్ మాదిరిగానే ఇప్పటికే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది వ్యక్తిగత అంశాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించి బ్లాక్ మెయిల్ చేశారని, ట్యాపింగ్ బాధితులంతా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలో సీఎం, మంత్రులు ఏ స్థాయి వారు ఉన్నా సరే వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అసలు సూత్రధారులను పట్టుకోవాలని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి.