– ఇకపై జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
– బంజారా హిల్స్ పీఎస్‌ను షిఫ్ట్ చేసిన పోలీసులు
– జూబ్లీ హిల్స్ పీఎస్ నుంచే విచారణ చేస్తున్న సిట్
– ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
– కేసులో కీలక ఆధారాల సేకరణ
– మరికొంత మంది అరెస్ట్‌కు రంగం సిద్ధం
Phone tapping case twist changed banjara hills ps to jublee hills ps : సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. ఈ కేసును బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. ప్రధాన నిందితుడు రాధాకిషన్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది ఇక్కడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచే. అయితే, ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ, ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఈ విషయాన్ని ముందే చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సమాచారం. కొందరు పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లింక్స్‌పై ‘స్వేచ్ఛ’ ముందే అనుమానాలు వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ పీఎస్‌కు కేసు మారుతుందని ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది.
ప్రభాకర్ రావు ఇండియాకు రాగానే అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ లాకర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జూన్ 26న ఆయన ఇండియాకు రావాల్సి ఉండగా, ఓవైపు రెడ్ కార్నర్ నోటీసులు, మరోవైపు కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ నెల చివరి వారంలో ప్రభాకర్ రావు ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే పలువురు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ప్రబాకర్ రావు ఇండియాకు రాగానే అదుపులోకి తీసుకోనున్నారు.
విమానాశ్రయంలోనే నిందితుల అరెస్ట్
ప్రభాకర్ రావుతో పాటు 6వ నిందితుడిగా ఉన్న ఐన్యూస్ ఛానల్ ఓనర్ శ్రవణ్ కుమార్ విచారణ కూడా కీలకం కానుంది. ఇతను కూడా విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో వీరిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇద్దరిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా సెక్షన్ 73 చట్టం కింద ఆదేశించబడింది. దీంతో వీరిని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను పోలీసులు పూర్తి చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, ఇంటర్ పోల్‌కు అందించినట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ ఉన్నందున, ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే వీరిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ కేసు బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చడం సంచలనంగా మారింది.