– సుప్రీమో ఆదేశాలతోనే ట్యాపింగ్, సెర్చింగ్ ఆపరేషన్స్
– ఇంతకీ ఎవరా సుప్రీమో..? కేసీఆరేనా..?
– బీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపించేందుకు రావుల కూటమి ప్లాన్స్
– ప్రతీ ఎన్నికకు పోలీస్ వాహనాల్లోనే డబ్బు తరలింపు
– నాటి విపక్షాల నగదు కోసం ట్యాపింగ్ వాడకం
– రాధా కిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు
Task Force Ex Osd Radhakishan Rao Reaveal The Secrets : ఫోన్ ట్యాపింగ్ కేసులో డొంకంతా కదులుతోంది. పోలీసుల అదుపులో ఉన్న రాధా కిషన్ రావు గుట్టంతా విప్పారు. బీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపించేందుకు, ట్యాపింగ్‌ను ఎలా వాడారో అన్ని వివరాలు పూసగుచ్చినట్టు వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు పోలీసులు. ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాల్లోనే డబ్బు తరలించామని ఒప్పుకున్న రాధా కిషన్, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్లలో సైతం డబ్బును పోలీసుల ద్వారానే తరలించినట్టు చెప్పారు.
హుజూర్ నగర్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలపైనా దృష్టి పెట్టి, వాళ్ల లావాదేవీలపై ప్రధానంగా నిఘా పెట్టారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా చేశానని ఒప్పుకున్నారు రాధా కిషన్ రావు. మునుగోడు బై ఎలక్షన్‌లో కోమటిరెడ్డికి చెందిన మూడున్నర కోట్లు సీజ్ చేశామని, దుబ్బాక బై ఎలక్షన్‌లో రఘునందన్ రావుకు చెందిన కోటి రూపాయలు సీజ్ చేశామని, అలాగే, భవ్య సిమెంట్స్‌కు చెందిన 70 లక్షల రూపాయలను 2018 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ ద్వారానే సమాచారం సేకరించి సీజ్ చేసినట్టు తెలిపారు.
Read Also: ట్యాపింగ్ ఎఫెక్ట్ ఖాకీల అరెస్ట్..!!
ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు ఎప్పుడూ బీఆర్ఎస్ బలోపేతం గురించే చర్చించేవారని చెప్పారు రాధా కిషన్ రావు. ఎప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండేలా మనం పని చేయాలనేవారని, వాట్సాప్, స్నాప్ చాట్, సిగ్నల్ యాప్ ద్వారా తరచూ రహస్యంగా చర్చించుకున్నట్టు వివరించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా వచ్చాక పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైందని చెప్పారు. అసలు ఎస్ఐబీ చేయాల్సిన పని కాకుండా ఎంతసేపు బీఆర్ఎస్ కోసమే పని చేసేవాళ్లమని తెలిపారు రాధా కిషన్. ప్రత్యర్థి పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు మాత్రమే పని చేశామని, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, వేణుగోపాల్ రావు, గట్టుమల్లు లాంటి నమ్మకమైనవారిని ప్రభాకర్ రావు ఎస్ఐబీలో నియమించారని వివరించారు.
మూడోసారి బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐబీ పని చేసిందని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి కుటుంబసభ్యులు, వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యాపారవేత్తల కార్యకలాపాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. అలాగే, బీఆర్ఎస్‌లో ఉన్న కొంతమంది అనుమానిత నేతలపై కూడా నిఘా పెట్టినట్టు గుట్టంతా విప్పారు. వారి సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టే తనకు రిటైర్ అయిన తర్వాత కూడా మూడేళ్ల పాటు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పోస్టింగ్ ఇచ్చారని చెప్పారు రాధా కిషన్ రావు. సుప్రీమో నుంచి వచ్చిన ఆదేశాలతోనే తాము ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని ఒప్పుకున్నారు. దీంతో ఆ సుప్రీమో ఎవరనే చర్చ జరుగుతోంది. ముమ్మాటికీ కేసీఆరేనని ప్రచారం జరుగుతోంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదేనని అనుమానాలు కలుగుతున్నాయి.