– కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనేవి ఎవిడెన్స్ కాదు
– ఈ విషయం అందరికీ తెలుసు
– సర్కస్‌లో జోకర్‌లా ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారు
– కరెంట్, నీళ్లు ఇవ్వడంలో సర్కారు ఫెయిల్
– ప్రధాన సమస్యలను సైడ్ చేసేందుకే ట్యాపింగ్ కేసు
– కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ నిరంజన్ రెడ్డి
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన సమస్యలు పక్కన పెట్టడానికే నిత్యం ఏదో ఒక లీకేజ్ వార్తను తెరపైకి తెస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం, మంత్రులు దీనిపై స్పందించడం లేదని, లీకులు ఇస్తున్నారని ఫైరయ్యారు. ట్యాపింగ్ పరికరాలు ధ్వంసం చేసి మూసీలో పడేస్తే, సీఎం, మంత్రులు ఈదుకుంటూ వెళ్లి తీసుకొస్తారా? అని దుయ్యబట్టారు. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనేవి ఎవిడెన్స్ కాదని అందరికీ తెలుసని పేర్కొన్నారు. సర్కస్‌లో జోకర్‌లా అవసరం అయినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చి వాడుకుంటున్నారని విమర్శించారు.
ఇదంతా సెన్స్ లేని నాన్సెన్స్ అంటూ మాట్లాడారు నిరంజన్ రెడ్డి, ఇంతవరకూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఎంతసేపూ పక్కవారిపై నిందలు వేయడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని అన్నారు. గత ప్రభుత్వంపైన విమర్శలు చేయటం తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. ఇస్తామన్న బోనస్ బోగస్‌లా అయ్యిందని ఎద్దేవ చేశారు.
రైతులపై లాఠీచార్జి చేయటం సరికాదన్న నిరంజన్ రెడ్డి, తమ హయాంలో విత్తనాల కోసం లైన్‌లో నిలబడింది లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు క్యూ లైన్‌లో నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు నీళ్ళు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం నీళ్ళే దిక్కయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో కరెంట్, నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.