– కుట్రదారులెవరు? పాత్రధారులెవరు?
– ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు
– కీలకంగా నిందితుల వాంగ్మూలాలు
– ట్యాపర్స్ ఎవరో, విక్టిమ్స్ ఎవరో ఫుల్ క్లారిటీ
– నిజమైన ‘స్వేచ్ఛ’ కథనాలు
– అన్నీ ఒప్పేసుకున్న పోలీస్ ఆఫీసర్లు
– ‘ఇది జస్ట్ ట్రైలరే.. పిక్చర్ అభీ బాకీ హై’ పేరుతో మార్చి 26న ‘స్వేచ్ఛ’ కథనం
– మీడియా ప్రతినిధులు, ఇద్దరు మాజీ మంత్రుల పాత్రపై ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
– జరిగిన తతంగం అంతా కథనాల రూపంలో బయటపెట్టిన ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం
– కన్ఫెషన్ రిపోర్టుల్లో అదే వివరించిన నిందితులు
దేవేందర్ రెడ్డి, 9848070809
Police Investigation: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి. తెలంగాణ పోలీసుల ముసుగులో తన సామాజిక వర్గం వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించిన కేసీఆర్ చేసిన అనైతికమైన పనులన్నీ ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. పోలీసులే కీలక నిందితులైన ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే కీలక ఆధారాలు రాబట్టింది. ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచుతోంది. నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాలలోని అంశాలు ‘స్వేచ్ఛ’ చేతికి చిక్కాయి. అందులోని విషయాలను గమనిస్తే, నివ్వెరపోయే నిజాలు వెలుగుచూశాయి.
వాంగ్మూలాల్లోని కీలక విషయాలు
తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రభాకర్ రావు తరచూ రాధాకిషన్ రావుతో మాట్లాడుతుండేవాడు. ఏదైనా నియోజకవర్గంలోని నాయకులు, వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి, అక్కడి ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారితే, వెంటనే, వారి వివరాలను ప్రణీత్ రావుకు పంపి ప్రొఫైల్ తయారు చేయించి, నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించేవాడు. తద్వారా వారి వ్యూహాలను కనిపెట్టి, వాటిని బీఆర్ఎస్ నేతలకు చేరవేసేవారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతల మీద కూడా నిఘా పెట్టారు. కుత్బుల్లాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందతో విభేదాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరిని వ్యతిరేకించే రాజయ్య మీద, అలాగే అప్పటి తాండూరు ఎమ్మెల్యే మీద అంసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆయన భార్య మీద కూడా నిఘా పెట్టారు. అంతేకాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న వాడుతున్న ఫోన్ సంభాషణలనూ సేకరించారు.
మీడియా ప్రతినిధులు, కీలక లీడర్లపై నిరంతర నిఘా
అప్పటికి బీఆర్ఎస్‌కు గట్టిగా సవాల్ విసురుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ల మీద కూడా నిరంతర నిఘా కొనసాగింది. అలాగే, మీడియా రంగానికి చెందిన ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంభాషణలనూ ప్రణీత్ రావు బృందం రికార్డు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడైన రఘువీర్ రెడ్డి, గద్వాల నేత సరితా తిరపతయ్య, కోరుట్ల నేత జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మానకొండూరు నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బృందంలోని సభ్యుల ఫోన్లనూ ఈ క్రమంలో ట్యాప్ చేశారు. ఈటల రాజేందర్, బండి సంజయ్, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖ వ్యాపారుల ఫోన్లనూ ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తూ, వారు ఎవరితో మాట్లాడుతున్నారు? వంటి అంశాలను పరిశీలిస్తూ వచ్చారు.
హరీష్ రావు పాత్ర.. రంగంలోకి ఐన్యూస్ ఓనర్ శ్రవణ్
నాయకులే కాదు, అధికారులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖులు నేరుగా ఫోన్‌లో మాట్లాడటానికి భయపడి, వాట్సాప్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడారు. దీంతో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్) మీద ఆధారపడి ఇంటర్ నెట్ కాల్స్‌ని కూడా వినే ప్రయత్నం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, నాటి మంత్రి హరీష్ రావు ఆదేశం మేరకు ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ నేరుగా ప్రభాకర్ రావుతో టచ్‌లోకి వెళ్లారు. శ్రవణ్ కుమార్‌ను కలిసి, అతనితో కలసి పనిచేయాలంటూ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును ఆదేశించారు. దీంతో శ్రవణ్ కుమార్, ప్రణీత్ రావుతో సహా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలోని అధికారులతో నేరుగా మాట్లాడి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు దారుల సమాచారం, వారి రాజకీయ వ్యూహాలు, వారికి ఆర్థికంగా సాయపడే వ్యక్తుల వివరాలు సేకరించి, తమ పార్టీ అధినాయకత్వానికి చేరవేశారు. అలాగే, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేస్తున్న వ్యక్తుల వివరాలను, వారి ఫోన్ సంభాషణలను సేకరించే ప్రయత్నమూ జరిగింది.
కుట్ర అంతా ముందే బయటపెట్టిన ‘స్వేచ్ఛ’
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐన్యూస్ ఓనర్ శ్రవణ్, నమస్తే తెలంగాణ దామోదర్ రావు పాత్రను ముందుగా బయటపెట్టింది ‘స్వేచ్ఛ’. సంబంధిత స్క్రీన్ షాట్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అందించి, ఈ కేసు తీవ్రతను అందరికీ వివరించింది. నిజానికి, ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన కథనాల తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ యాంగిల్‌లో వార్తలను ఇవ్వడం ప్రారంభించింది. అంతేకాదు, ప్రభాకర్ రావుకు బెదిరింపుల వ్యవహారం, మాజీ మంత్రుల పైరవీలు, దామోదర్ రావు పాత్ర ఇలా చాలా విషయాలను ఎక్స్‌క్లూజివ్‌గా కథనాలు అందించింది ‘స్వేచ్ఛ’. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఎలా అయ్యాయి. ఎవరెవరి పాత్ర ఏంటో ఫుల్ క్లారిటీగా ప్రజల ముందు ఉంచింది. ఇప్పుడు నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు తమ వాంగ్మూలాల్లో అవే విషయాలను వెల్లడించారు.
రఘునందన్ రావు, బీజేపీ నేత
రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లాలి. ప్రభాకర్ రావు వచ్చాక ఆయన ఏం చెప్తారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా స్వేచ్ఛ-బిగ్ టీవీ కథనాలను సుమోటోగా తీసుకుని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయం ఉండకూడదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తప్పుడు అరెస్టులకు ప్రయత్నించారు. బీఎల్ సంతోష్ అరెస్ట్ కాకుండా ఎలా పోరాడామో, కేసీఆర్ అరెస్ట్ కోసం అలా పోరాడుతాం. కేసీఆర్ తప్పు మీద తప్పు చేశారు. కవితను బయటకు తీసుకురావడానికి కేసీఆర్ ఎమ్మెల్యేల కోనుగోలు కేసు అంటూ ఎన్నో డ్రామాలు చేశారు. బీజేపీ నేతలను ఇరికించేందుకు చూశారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్, పోలీసులను అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడారు.
వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే
పదేళ్లు దుర్మార్గ పాలన జరిగింది. సొంత పార్టీ వాళ్లనే నమ్మకుండా వాళ్లపై నిఘా పెట్టి వారి నిత్య జీవితంలో జోక్యం కలిగించుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇటువంటి రాజకీయాలు గతంలో ఎవరూ చేయలేదు. నేనూ బాధితుడ్నే, నా ఫోన్ ట్యాప్ చేయించారు. గువ్వల బాలరాజు నాపై నిఘా పెట్టించారు. నాతోపాటు, చాలామంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి చట్టప్రకారం దోషులపై చర్యలు తీసుకోవాలి. గువ్వల బాలరాజు సహా ఇతర నేతలు, అధికారులను విచారించాలి. నా పర్సనల్ జీవితంలోకి దూరారు. అన్నీ తెలుసుకున్నారు.
ఈటల రాజేందర్, బీజేపీ నేత
మంత్రుల మీద కూడా నమ్మకం లేకుండా ఫోన్ ట్యాప్ చేశారు. వ్యక్తుల స్వేచ్ఛను హరించడం మంచిది కాదు. మాతో ఎవరు మాట్లాడితే, తర్వాత వారిని బెదిరించేవారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉండాలి కానీ, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులపై నిఘా ఏంటి? దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా ఇలాంటి వాటికి చరమగీతం పాడాలి. 2014 నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తూ వచ్చారు. చాలామంది లీడర్ల ఫోన్లను ట్యాప్ చేశారు. ఎవరు ఏం చేస్తున్నా తెలుస్తుందనే అహంకారంలో ఉండేవారు కేసీఆర్. నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ప్రజాక్షేత్రంలో ఇలాంటి వాటికి తప్పకుండా శిక్ష తప్పదు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత
ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఎవరు చేసినా తప్పే. స్వార్థ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదు. అలా చేసి ఉంటే ఎవరైనా చట్ట ప్రకారం శిక్షర్హులే. ఒక పోలీసు అధికారిగా పని చేసిన అనుభంతో నేను ఈ మాట చెబుతున్నా. రాజకీయపరంగా ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేసినా తప్పే.