- స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్.. అంతా పెద్దాయనే!
- రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్టుతో బయటపడ్డ బండారం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం
- పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావు ఏం చెప్పారు?
- ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అసలేం జరిగింది?
- కన్ఫెషన్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన
- అధికారం చేతిలో ఉంటే ఎంతకైనా బరితెగిస్తారా?
- ఖాకీ-ఖద్దర్ కలిసి సాగించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఫోన్ ట్యాపింగ్
- కేసు మొదలైనప్పటి నుంచి స్వేచ్ఛ-బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ కథనాలు
- స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎడిటర్ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి, 9848070809
Phone taping case radhakishan rao confession report sensetional secrets out:
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడవి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తెలంగాణ పోలీసుల ముసుగులో తన సామాజిక వర్గం వ్యక్తులకు సర్వం రాసి ఇచ్చేయగా, ఇల్లీగల్ పనులు చేసిన ప్రభాకర్ రావుని ఎప్పుడూ కలవకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా ఆధారాలు అనేవి దొరకకుండా తనకున్న రాజకీయ అనుభవ చతురతతో వ్యవహరించారు. అంతేకాదు, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నవీన్ చంద్ ఉన్నప్పుడు తీసుకున్న టూల్స్‌నే వాడుకుంటూ వచ్చారు. 2018 ఎన్నికల్లో విజయంతో మరింత రెచ్చిపోయిన బీఆర్ఎస్, పోలీసులను ప్రైవేట్ సైన్యంగా మార్చేసి ఇల్లీగల్ పనులకు పదును పెట్టింది. ఆ పాపం ఇప్పటికి పండింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా బట్టబయలు అవుతోంది. పోలీసులే కీలక నిందితులైన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే కీలక ఆధారాలు రాబట్టింది. ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచుతోంది. అలాగే, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మేల్యేల కొనుగోలు వ్యవహారం వీడియోలు, అడియోలు ఏ దారిలో వచ్చాయనేది పోలీసుల విచారణలో ఇప్పుడు తేటతెల్లం అయింది. టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉంటూ వ్యక్తిగత అక్రమాలకు పాల్పడ్డ రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్‌లో క్లియర్‌గా దీనిని వివరించారు. 6 పేజీల కన్ఫెషన్ రిపోర్టులో 3వ పేజీలోని నాల్గో పేరా, 4వ పేజీలోని మొదటి పేరా మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పైనే ఉంది. పోలీసుల ముందు అంతా వాంగ్మూలం ఇచ్చారు.
రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్టులోని కీలక అంశాలు
‘‘తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించి సిట్ ఇన్‌ఛార్జి ప్రభాకర్ రావు తరచూ నాతో మాట్లాడుతుండేవాడు. ఏదైనా నియోజక వర్గంలోని నాయకులు, వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి, అక్కడి ఎమ్మె్ల్యేలకు ఇబ్బందిగా ప్రమాదంగా మారుతున్నారని అనిపిస్తే, వెంటనే.. వారి వివరాలను ప్రణీత్ రావుకు పంపి, వారి ప్రొఫైల్ తయారుచేయించి, వారిపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించేవాడు. తద్వారా వారి వ్యూహాలను కనిపెట్టి, వాటిని బీఆర్ఎస్ నేతలకు చేరవేసేవారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతల మీదా నిఘా పెట్టారు. కుత్బుల్లాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందతో విభేదాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరిని వ్యతిరేకించే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి. రాజయ్య మీద, అలాగే తాండూరుకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి దంపతుల మీద కూడా నిఘా పెట్టారు. 2022 అక్టోబర్ చివరివారంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమూ మా ఫోన్ ట్యాపింగ్ వల్లనే సాధ్యమైంది. ఈ ఘటనకు కొన్ని వారాల ముందు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి అక్కడి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పటికే దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచి ఉండటంతో ఇక్కడ బీజేపీని ఓడించతీరక తప్పని పరిస్థితి బీఆర్ఎస్‌కి ఎదురైంది. నాకు గుర్తున్నంత వరకు 2022 అక్టోబరు చివరివారంలో సిట్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రావు దీని గురించి నాతో మాట్లాడారు. బీజేపీ తరపున కొందరు వ్యక్తులు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో టచ్‌లోకి వచ్చి బీజేపీలో చేరాలని కోరారని, వీలుంటే మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనూ వెంటతీసుకురావాలని కోరారని, అయితే.. రోహిత్ రెడ్డి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ చెవిలో వేయగా, ఆ వ్యక్తులతో బాటు ఎమ్మెల్యే మీదా నిఘా పెట్టాలని తనను ఆదేశించారని ప్రభాకర్ రావు నాతో చెప్పారు. దీంతో ఎప్పటిలాగానే నేను ఈ పనిని ప్రణీత్ రావుకు అప్పగించగా, అతడు సదరు వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేసి, వారి సంభాషణలతో కూడిన ఒక ఆడియో క్లిప్ రెడీ చేశాడు. అది ప్రభాకర్ రావు ద్వారా సీఎం కేసీఆర్‌కి చేరింది. అది విన్న కేసీఆర్.. ఆ వ్యక్తులను ట్రాప్ చేసేందుకు ఏదైనా చేయాలని ఆదేశించటంతో బాటు ఈ విషయంలో మాకు పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సూచించారు. మేం రచించిన పథకం ప్రకారమే.. రోహిత్ రెడ్డి.. నందు, మరో ఇద్దరు స్వామీజీలను మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లోని తన ఫామ్‌హౌస్‌కి రావాలని ఆహ్వానించారు. ఈలోపు నేను మా టాస్క్‌ఫోర్స్ అధికారి శ్రీనాథ్ రెడ్డితో బాటు మరో ఎస్సైని పంపి కెమేరాలు కొని తెప్పించి, ఒక రోజు ముందే ఫామ్‌హౌస్‌లో బిగించాం. ఈ లోపు పెద్దాయన (సీఎం కేసీఆర్) వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడి, రోహిత్ రెడ్డికి జత కలిపారు. పనిలో పనిగా లోకల్ పోలీసులతో మాట్లాడి, ఈ వ్యవహారంలో సహకరించాలనీ ఆదేశించారు. ఆ తర్వాత మేం అనుకున్నట్లుగానే వారు రెడ్ హ్యాండెడ్‌గా కెమేరాలకు దొరికిపోవటం, సైబరాబాద్ పోలీసులు రంగంలోకి కేసు నమోదు చేయటం, తర్వాత ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించటం జరిగింది. అయితే.. ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ కుమార్‌ను అరెస్టు చేసి జాతీయ స్థాయిలో ప్రచారం చేయటం ద్వారా, బీజేపీ ఒక అడుగు వెనక్కి వేసి, తనతో రాజీకి వస్తుందని, తద్వారా ఈడీ కేసులో ఇరుక్కున్న తన కుమార్తె కవితను కేసునుంచి విడిపించుకోవచ్చని కేసీఆర్ భావించారు. కాగా.. ఫామ్‌హౌస్ కేసుతో సంబంధమున్న కేరళకు చెందిన మాతా అమృతానందమయి సంస్థలో పనిచేసే మరో కీలక వ్యక్తి కోసం సైబరాబాద్ కమిషనరేట్‌లోని కొందరు పోలీసు అధికారులను కేరళకు పంపినా, వారి అసమర్థత వల్ల ఆ వ్యక్తి తప్పించుకోవటం, ఎలాగైనా అతడిని అరెస్టు చేసి తీరాలనే పట్టుదలతో వెంటనే ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎస్ఐబీ ఎస్సై గట్టుమల్లు, మరికొందరిని చార్టెట్ ఫ్లయిట్‌లో కేరళ పంపినా ప్రయోజనం లేకపోయింది. ఈలోగా ఈ కేసు హైకోర్టుకు చేరటం, నిందితులను అరెస్టు చేయరాదంటూ న్యాయస్థానం ఆదేశాలివ్వటం, తర్వాత ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయటం జరిగిపోయాయి. ఈ కేసులో తాను ఆశించిన ఫలితం రాకపోయే సరికి పెద్దాయనకు విపరీతమైన కోపం వచ్చింది. 2020లో పదవీ విరమణ చేసిన నన్ను.. పెద్దాయన ఏకంగా రెండు సార్లు సిటీ టాస్క్‌ఫోర్స్‌లో కీలక స్థానంలో కూర్చోబెట్టారు. నేను ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను కనుక.. ఈ కేసులో తర్వాతి పరిణామాలను నేను మీకు వెల్లడించలేను’’.
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేందుకు నిదర్శనంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసును చూడొచ్చు. అందుకు ఆయా తేదీల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం.
2022, అక్టోబర్ 26
మొయినాబాద్ ఫాంహౌస్‌లో అప్పటి ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను కొనేందుకు డీల్ సెట్ చేసేందుకు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ వచ్చారని పోలీసులు ఆపరేషన్ ఫాంహౌస్‌ను తెరపైకి తెచ్చారు. అంతకుముందు ఉదయం 11 గంటలకి రోహిత్ రెడ్డి తనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ నేతలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో వంద మంది పోలీసులతో సీక్రెట్ ఆపరేషన్ మొదలైంది. అయితే, ఎవరైనా కుట్రలు చేస్తున్నారంటే వెంటనే ఆపేలా చేయాలి. డబ్బుల వ్యవహారం అయితే, ఏసీబీని సంప్రదించాలి. కానీ, ఎలాంటి అధికారం లేకుండా హడావుడి చేసేందుకు వీడియోలు, సాక్ష్యాలు దొరికాయని ఉదయం 11 గంటలకు ఫిర్యాదు చేసినట్టు సాయంత్రం ఎఫ్ఐఆర్ నెంబర్ 455/2022 ని నమోదు చేశారని నిందితులు అనేక డౌట్స్ వ్యక్తం చేశారు.
2022, అక్టోబర్ 27
నిందితులను 24 గంటలపాటు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. 27న సాయంత్రం వనస్థలిపురంలోని జడ్జి ఇంట్లో ముగ్గుర్నీ ప్రవేశపెట్టారు. డబ్బులు లేకుండా ఎలా పీసీ యాక్ట్ అమలు అవుతుందని, పెట్టిన సెక్షన్స్ అన్నీ 7 సంవత్సరాల లోపే కావడంతో సీఆర్పీసీ 41 ఇవ్వాలి అంటూ ప్రశ్నించి రిమాండ్ రిజక్ట్ చేశారు రాజేంద్రనగర్ కోర్టు జడ్జి.
2022, అక్టోబర్ 28
28న ఉదయం 9 గంటలకు రోహిత్ రెడ్డి, నందకుమార్ మాట్లాడుకున్న ఆడియోలు 1, 2 అని టీ న్యూస్, ఎన్టీవీలో ప్రసారం అయ్యాయి. అదే నెల 18న మాట్లాడినవి కూడా వినిపించారు. అయితే, వాట్సాప్, ఫేస్ టైంలో మాట్లాడినవి ఎలా బయటకు వచ్చాయో తెలియదు. దీనికోసం అత్యాధునిక టూల్స్ వాడారని కన్ఫెషన్‌లో రాధాకిషన్ రావు తెలిపారు. 28న రాత్రి 12 గంటలకు నిందితులను రిమాండ్‌కు పంపించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అధార్ కార్డులు ఇవ్వాల్సిందిగా చెప్పడంతో అవి సరితూగడం లేదని రెండుగా ఉన్నాయని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూనే ఆదార్ కార్డులు సమర్పించలేదు కాబట్టి మరోసారి హాజరు పర్చాలని కోర్టు స్పష్టం చేసింది.
2022, అక్టోబర్ 29
29న ఉదయం మీడియాతో మాట్లాడకుండా ముగ్గురు నిందితుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ విషయంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కోర్టుకు వెళ్లి వేడుకోవాల్సి వచ్చింది.
2022, నవంబర్ 3
నవంబర్ 3న కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. మొత్తం వీడియోలు, ఆడియోలు జడ్జిలకు, రాష్ట్రపతి, గవర్నర్‌లకు అందరికీ పంపుతున్నట్టు ప్రకటించారు. 27నే నిందితులతో పాటు రికార్డు చేసిన ఆడియోలు, వీడియాలను కోర్టుకు ఇవ్వాల్సింది. కానీ, 30న సమర్పించారు. అదే వీడియాలు 3వ తేదీన కేసీఆర్ ఎలా ప్లే చేశారు? కోర్టులో ఉండాల్సిన ఎవిడెన్స్ సీఎం చేతికి ఎలా వచ్చింది? ఎవ్వరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ సమాధానం లేదు.
2022, నవంబర్ 7
7వ తేదీన 7 మంది ఐపీఎస్‌లతో సిట్ ఏర్పాటు చేశారు. 10,11 తేదీల్లో నిందితులను కస్టడీకి తీసుకున్నారు. అప్రూవర్‌గా మారి అమీత్ షా, నడ్డా, తుషారా, బీఎల్ సంతోష్ పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. లేదంటే కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేస్తామని హెచ్చరించారు. 160 మంది సాక్షులుగా విచారించి వారితోనే ఫిర్యాదులు పెట్టించారు. నందకుమార్‌పై మూడు రోజుల్లోనే 11 కేసులు నమోదు అయ్యాయి. హోటల్ సిబ్బందిని, వెండర్స్‌ని తీసుకెళ్లి టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో అక్రమంగా బంధించి కొట్టి మరీ కేసులు పెట్టించారు. ఇలా ముగ్గురు నిందితులను వేధించి అప్రూవర్‌గా మారాలని బెదిరించినట్లు వారు ఇప్పటికీ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఫిలింనగర్‌లో హీరో వెంకటేష్, సురేష్ బాబుల లీజ్ హోటల్‌ని కూల్చివేశారు. కోర్టు కంటెంప్ట్ కింద ఇంకా ఈ కేసు వివాదంలోనే ఉంది. 50 కేసులు పెట్టించైనా అనుకున్నది చేయాలనుకున్నారు.
2022, డిసెంబర్ 25
డిసెంబర్ నెలలో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కేసుని స్లో చేసింది సిట్. డిసెంబర్ 25న కేసును సీబీఐకి ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.