- విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిజ్ స్తాన్ లో దాడులు
- ఫలించిన భారత రాయబారం నిలిచిపోయిన ఆందోళనలు
- భారతీయ విద్యార్థుల కోసం ఢిల్లీకి విమాన ప్రయాణ ఏర్పాట్లు
- విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్న కిర్గిజ్ స్తాన్ ప్రభుత్వం
- భారత విద్యార్థులకు క్షమాపణలు చెబుతున్న కిర్గిజ్ స్తాన్ ప్రజలు
- కొందరు ఆకతాయిలు చేసిన పనితో తమ దేశానికి చెడ్డపేరు
- మన దేశంతో పోల్చితే వైద్య విద్యకు అయ్యే ఖర్చు అక్కడ తక్కువ
- కిర్గిజ్ స్తాన్ లో విద్యనభ్యసిస్తున్న 15 వేల మంది భారత వైద్య విద్యార్థులు
Peaceful atmosphere in kyrgyzstan indian students allow to return india:
కిర్గిజ్ స్థాన్ దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్న విషయం విదితమే… రాజధాని బిష్కెక్‌లో గత మూడు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే భారత్ లో వేలాది కుటుంబాల్లో తమ బిడ్డల భవిష్యత్ పై కొత్త టెన్షన్ ను తెప్పిస్తోంది. ఈ దేశంలో వైద్య విద్య చేసేందుకు వేలాది మంది భారత విద్యార్థులు ప్రతి ఏటా వెళుతుంటారు. మన దేశంలో వైద్యవిద్యతో పోలిస్తే.. ఈ దేశంలో తక్కువగా ఉండటం ఒక కారణం. లోకల్ – నాన్ లోకల్ పంచాయితీతో అక్కడ గొడవలు జరగటం.. కిర్గిజ్ స్థాన్ స్థానికులు మనోళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో భారతీయులకు ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు. ఎట్టకేలకు సకాలంలో భారత్ చూపిన చొరవతో కిర్గిజ్ స్తాన్ లో హింసాకాండకు తెరపడింది.
సద్దుమణిగిన ఆందోళనలు
ప్రస్తుతానికి కిర్గిజ్ స్తాన్ లో గొడవలు సద్దుమణిగాయని, పరిస్థితి అదుపులోనే ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. వైద్య విద్యార్థులను స్వదేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి అక్కడి యూనివర్సిటీలు . స్వదేశాలకు వెళ్లాలనుకునేవారు పేర్లు ఇవ్వాలని విద్యార్థులకు సూచించాయి. మరో వారం రోజుల్లోనే తమ స్వస్థలాలకు వెళ్ళిపోతామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడి తెలుగు విద్యార్థులు. దీనితో వారి తల్లిదండ్రులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కిర్గిజ్ స్తాన్ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ వరకు ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేశామని భారత ఎంబసీ ప్రకటించింది. ఇక్కడికి చేరుకున్నాక ఢిల్లీ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా తమ స్వస్థలాలకు చేరుకుంటామంటున్నారు తెలుగు విద్యార్థులు. అయితే ఈ విషయంలో కిర్గిజ్ స్తాన్ ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. కొందరు ఆకతాయిలు చేసిన చర్యలతో తమ దేశానికి చెడ్డపేరు వచ్చిందని విదేశీ విద్యార్థులకు క్షమాపణలు చెబుతున్నారు. విదేశీ విద్యార్థులను అత్యంత దారుణంగా హింసించడం చాలా బాధాకరం అంటున్నారు అక్కడి ప్రజలు. కొందరు సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ల ద్వారా తమ సందేశాలను పంపుతున్నారు. మరికొందరు నేరుగా విదేశీ విద్యార్థుల వద్దకు వెళ్లి క్షమాపణలు కోరుతున్నారు. ఇక మీదట గొడవలు జరగకుండా అందరం కలిసిమెలిసి ఉంటామంటున్నారు స్థానిక ప్రజలు. ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదని విదేశీ విద్యార్థులను ఆలింగనం చేసుకుని వారికి ధైర్యం చెబుతున్నారు.
15 వేల మంది భారతీయ విద్యార్థులు
ఈ దాడుల్లో పాకిస్థానీ విద్యార్థులు ముగ్గురు బలయ్యారన్న సంగతి తెలిసిందే. ఇంతకూ కిర్గిజిస్థాన్ లో మన విద్యార్థులు ఎందరో తెలుసా? ప్రస్తుతం ఆ దేశంలో 15వేల మంది వరకు భారతీయ వైద్య విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరికి తోడుగా వందలాది మంది భారతీయ సిబ్బంది కూడా అక్కడ ఉంటున్నారు. మన కార్పొరేట్ కాలేజీల మాదిరి అక్కడి వైద్య విద్యను ఒక పక్కా బిజినెస్ గా చేశారని చెప్పాలి. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే ఏడాదికి కనీసం 20-25 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. అదే.. ఆ దేశంలో అయితే కేవలం రూ.25 లక్షల్లోనే (హాస్టల్.. ఫుడ్ తో సహా) మెడిసిన్ ను పూర్తి చేయొచ్చు.
తక్కువ ఖర్చుతో మెడిసిన్
మెడిసిన్ చేయాలని బలంగా కాంక్షించే వారు.. ఆ దేశంలో మెడిసిన్ చేస్తుంటారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడుకున్న కొందరు.. కొన్నేళ్ల క్రితం మెడికిల్ వర్సిటీలు ఏర్పాటు చేసి.. మన కార్పొరేట్ కాలేజీల మాదిరి అన్ని ఏర్పాట్లు చేయటం.. తక్కువ ఖర్చుతో మెడిసిన్ చేసేందుకు అవకాశాలు ఉండటంతో వందలాది మంది ప్రతి ఏడాది ఆ దేశానికి వెళుతుంటారు. దీంతో పాటు జార్జియాకు కూడా పెద్ద ఎత్తున వెళుతుంటారు. కిర్గిజ్ స్థాన్ తో పోలిస్తే జార్జియాలో ఖర్చులు కాస్త ఎక్కువ. క్లినికల్ శిక్షణతో పాటు ఐదారేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఈ దేశంలో అతి తక్కువ ఖర్చుకావటంతో ఆ దేశంలో మెడిసిన్ చేసేందుకు మొగ్గు చూపే పరిస్థితి. ఇంతకూ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయానికి వస్తే.. భారతీయులు.. ముఖ్యంగా తెలుగోళ్లు ఉన్న ప్రాంతాల్లో గొడవలు జరగట్లేదని చెబుతున్నారు. పరిస్థితి అదుపులో ఉందని.. ప్రతి హాస్టల్ బయట కిర్గిజ్ స్థాన్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. టీవీల్లో వార్తలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు.. బంధువులు ఆందోళన చెందుతూ తమ పిల్లలకు ఫోన్లు చేశారు. తాము క్షేమంగా ఉన్నామని.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రతి హాస్టల్స్ లో నలుగురు ప్రొఫెసర్లను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు రక్షణ కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ఇబ్బందికరంగా లేదనే మాట వినిపిస్తోంది. ఇక.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు నాలుగైదు వేలకు పైగా విద్యార్థులు మెడిసిన్ చేస్తున్నట్లు సమాచారం.