Blade Batch: పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులతో మాట్లాడుతూ ‘బ్లేడ్ బ్యాచ్’ అంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి అభిమానితో ఫొటో దిగాలనీ తనకూ ఉన్నదని, కానీ, తన అభిమానుల ముసుగులో బ్లేడ్ బ్యాచ్ వస్తున్నదని తెలిపారు. ఆ బ్లేడ్ బ్యాచ్ తనను, తన సిబ్బందిని బ్లేడ్‌తో చిన్నగా గాయపరుస్తున్నదని చెప్పారు. అందుకే పార్టీలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఎన్నికల ముంగిట్లో పవన్ కళ్యాణ్ వెల్లడి చేసిన ఈ విషయాలు చర్చను రాజేస్తున్నాయి.
గతంలో కూడా ఎన్నికల ముందే ప్రస్తుత సీఎం జగన్ పైనా కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ఎయిర్‌పోర్టులో జగన్ పై కత్తితో దాడి జరిగింది. ఆ ఘటన కొన్ని రోజులపాటు ఏపీలో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో కత్తి దాడి హైలైట్ అవుతుందని అనుకున్నారు. వాస్తవానికి ఆ సింపథీ వైసీపీకి ఎంత కలిసి వచ్చిందో చెప్పలేం కానీ, రాజకీయాలు ఏ దిశగా వెళ్లుతున్నాయా? అనే సీరియస్ డిస్కషన్ జరిగింది.
కేసు దర్యాప్తు విషయాన్ని పక్కనపెడితే.. జగన్ పై దాడి జరిగింది వాస్తవం. ఆయన గాయపడ్డది వాస్తవం. ఇప్పుడు ఎన్నికల ముంగిట్లోనే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అవే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొందరు బ్లేడ్‌తో కోస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగడానికి అందరూ తోడ్పడాలి. కానీ, హింసను ఎన్నికల కోసం ఉపయోగించడాన్ని ఎవరూ సమర్థించరు.
అసలు ఈ ఐడియా ఎవరిచ్చారు? ఈ దాడుల వెనుక ప్రయోజనాలేంటీ? రాజకీయ ప్రత్యర్థులేమైనా ఉన్నారా? లేక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పై కక్షగట్టారా? ఫ్యాన్ వార్‌లో భాగమా? ఈ ప్రశ్నల కేంద్రంగా చర్చ జరుగుతున్నది.