– మల్లంపేటలో కబ్జా కహానీ
– దాదాపు పది పార్కుల స్థలం ఆక్రమణ
– విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
– మున్సిపల్ కమిషనర్‌కు అందిన ఫిర్యాదు
Park space occupied In Mallampeta: గత పదేళ్లలో హైదరాబాద్, శివారు ప్రాంతాల భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఈ క్రమంలోనే కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు బోర్డు పాతేయడం, సైలెంట్‌గా నిర్మాణాలు చేపట్టిన ఘటనలు అనేకం వెలుగుచూశాయి.
తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో కబ్జా బాగోతం బయటపడింది. బీజేపీ నేత ఆకుల సతీష్ దీనిపై దుండిగల్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కబ్జా కహానీ వెలుగుచూసింది. ఆ ఫిర్యాదు ప్రకారం, కేవీఆర్ లే అవుట్‌లో (ప్రణీత్ నగర్ కాలనీ) దాదాపు పది పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు. దీని వెనుక స్థానిక నేతల హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు సతీష్. అంతేకాదు, సంతకం ఫోర్జరీ చేయడం, నకిలీ వ్యక్తితో పార్కు స్థలాల రిజిస్ట్రేషన్ చేసి అమ్మడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read:కిడ్నాప్ చేసి భూమి లాక్కున్న కేసులో ఏసీపీ, తహశీల్దార్
సర్వే నెంబర్లు 11, 12, 13, 15, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 45, 46, 261, 262, 263 మల్లంపేటలో కేవీఆర్ లే అవుట్ 54 ఎకరాల్లో ఉంది. ఈ వెంచర్‌లో 14 పార్కులు చూపిస్తూ అనుమతులు తీసుకున్నారు. కానీ, 2014 తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు బఫర్ జోన్ కేవీఆర్ కాలనీ పార్క్ ఓపెన్ స్పేస్ స్థలాలపై స్థానిక లీడర్లు, అనుచరుల కన్నుపడింది. దీనికోసం సంతకం ఫోర్జరీకి కూడా పాల్పడ్డారు. దాదాపు వంద కోట్ల ఆస్తిని కొట్టేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ కబ్జాలపై తక్షణమే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఆకుల సతీష్ కోరారు.