– పదవి పోయినా మారని కేసీఆర్
– ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూస్తూ విమర్శలు
– సడెన్‌గా ఓయూ విద్యార్థులపై పుట్టుకొచ్చిన ప్రేమ
– పదేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ తిప్పికొట్టిన విద్యార్థి సంఘాలు
– ఆనాడు బలవంతంగా హాస్టళ్లను మూసివేసిన అంశాన్ని గుర్తు చేస్తూ కౌంటర్లు
– కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనా?
– కేసీఆర్ తీరుపై విద్యార్థి, హస్తం వర్గాల ఆగ్రహం
KCR criticige Reventh sarkar issue of O.U. students: తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టు, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తీరు చూశాక ఇదే సామెత రాష్ట్రంలో రీ సౌండ్ ఇస్తోంది. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న ఆయన్ను చూసి కొందరు జాలి పడుతుంటే, మరికొందరు మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు. కానీ, బీఆర్ఎస్ నేతల దృష్టిలో నాలుగేళ్లయినట్టుంది. ఏ చిన్న విషయాన్నయినా చిరిగి చాటంత చేస్తున్నారు. మొన్నటికి మొన్న తాను భోజనం చేస్తుంటే కరెంట్ పోయిందని, అంతకుముందు ఎన్నికల సభలో పవర్ పోయినట్టు ప్రకటనలు చేశారు కేసీఆర్. తాజాగా ఉస్మానియా విద్యార్థుల విషయంలోనూ కలగజేసుకున్నారు. ఆ వెంటనే గులాబీ దళం అదే పనిగా రాష్ట్రం అంతా నీళ్లు లేవు, కరెంట్ కోతలు అంటూ హడావుడి మొదలుపెట్టింది. అయితే, పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆయా సంఘాలు కౌంటర్ ఎటాక్ కొనసాగించడంతో గులాబీ దళం షాకయ్యింది.
అదంతా ప్రేమేనా?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ విద్యార్థులు చేసిన త్యాగాలు ఎవరూ మర్చిపోరు. ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తిన్నారు. మరికొందరు ఆత్మాహుతికి ప్రయత్నించారు. అనేక మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సెంటిమెంట్‌తో గెలిచి తొలి సీఎంగా కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు. పదేళ్ల పాటు ఏ అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయారు. అయితే, ఈ పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ గురించి గానీ విద్యార్థి సంక్షేమం కోసం గానీ ఏనాడూ మాట్లాడలేదేనే ఆరోపణలు ఉన్నాయి. అసలు యూనివర్సిటీ గడప కూడా తొక్కలేదు కేసీఆర్. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి, మేధో చర్చలు లేకుండా నిర్బంధాలు విధించి, ఎలాంటి నోటిఫికేషన్లు, నియామకాలు జరపకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పదవిలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ఉస్మానియా విద్యార్థుల సమస్యలు ఇన్నాళ్లకు గుర్తొచ్చాయా అంటూ కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేసీఆర్ హయాంలో ఏం జరిగింది?
వాస్తవానికి విద్యార్థులను ఖాళీ చేయించేందుకు ప్రతి సంవత్సరం అన్ని యూనివర్సిటీలలో జరిగే తంతే ఇది. గతేడాది కూడా మే 14వ నుంచి జూన్ 4 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఆ సందర్భంలోనూ నీటి, కరెంటు కొరత సమస్యలతో సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉస్మానియా వర్సిటీ నోటీసు నెం.752 / సీడబ్ల్యూఓ / హెచ్ అండ్ ఎం / ఓయూ / 2023 జారీ చేసింది. ఆ సందర్భంలో విద్యార్థులు సైతం పోటీ పరీక్షల నేపథ్యంలో ‘మాకు సెలవులు అవసరం లేదు. మెస్, హాస్టళ్లు మూసివేయొద్దు. మేం పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది’ అంటూ ఓయూలో ఆందోళనలు నిర్వహించారు. అయినా, కనికరం లేకుండా అప్పట్లో బలవంతంగానే హాస్టల్స్, మెస్‌ను బంద్ చేశారు. విద్యార్థులు ఖాళీ చేయకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు. నీటి సరఫరా బంద్ చేశారు. బలవంతంగా హాస్టల్స్ నుంచి ఖాళీ చేయించారు. పదేళ్లుగా ఉస్మానియా వర్సిటీలో ప్రతీ ఏడాది సాగుతున్న ప్రక్రియ ఇదే. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్, మంత్రి హరీష్ రావు దీనిపై స్పందించింది లేదని విద్యార్థులు అంటున్నారు.
బుక్ చేద్దామని బుక్ అయ్యారా?
రేవంత్ సర్కారును బద్నాం చేయటమే లక్ష్యంగా అత్యుత్సాహంతో తెలంగాణ మొత్తం ఆగమాగం అయిపోయిందని.. ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది రోజులకే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్నట్లుగా కేసీఆర్ డ్రామా క్రియేట్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. గత ఏడాది కేసీఆర్ హయాంలో ఉస్మానియా వర్సిటీ విడుదల చేసిన పాత నోటీసును బయటకు తీసి దెబ్బకు దెబ్బ కౌంటర్ ఇస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వాన్ని బుక్ చేద్దామనుకున్న గులాబీ బ్యాచ్‌కు ఇది సమస్యగా మారింది. కేసీఆర్ పోస్టు చేసిన దానిని షేర్ చేసిన మాజీ మంత్రి కం మేనల్లుడు హరీశ్ రావు సైతం వెనుకా ముందు చెక్ చేయకుండానే రేవంత్ సర్కారుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో, అధికారం లేకపోవడంతో కేసీఆర్ అండ్ గ్యాంగ్ తట్టుకోలేకపోతోందని, అందుకే, రేవంత్ ప్రభుత్వంపై కావాలని కుట్రలు చేస్తోందని విమర్శలు చేస్తున్నాయి హస్తం వర్గాలు.