– అగ్రనేతల రాకకై కమలనాథుల ఎదురుచూపులు
– కొన్ని సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ ప్రచారం
– సొంత సీట్లకే పరిమితమైన బీజేపీ రాష్ట్ర నేతలు
– గ్రామ స్థాయి ప్రచారంతో హస్తం నేతల హడావుడి
Opposition: తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి మరో 48 గంటల్లో ప్రచార పర్వం ముగియనుంది. మే 13న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అయితే, అధికార కాంగ్రెస్ ప్రచారంలో మున్ముందుకు సాగిపోతుంటే, విపక్ష బీజేపీ మాత్రం అగ్రనేతల సభలకే పరిమితమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ తానూ పోటీలో ఉన్నానన్న రీతిలో ప్రచారం సాగిస్తోంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల ప్రచారం కాస్త డల్‌గా సాగే మాట నిజమే అయినా, ఈసారి తెలంగాణలో అది మరింత డల్‌గా సాగుతోంది. దీనికి తోడు భానుడి భగభగలూ పార్టీ ప్రచారానికి అడ్డంకిగా మారుతున్నాయి.
ముందంజలో కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచి, సత్తా చాటాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోంది. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని స్థానాలతో బాటు కంటోన్మెంట్‌నూ ఆయన చుట్టి వచ్చారు. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లోనూ ఆయన ప్రసంగించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలను ఆయన నిర్వహిస్తూ, హస్తానికి అండగా నిలవాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు ఈ ప్రచారంలో భాగస్వామలుగా ఉన్నారు. దీనికి తోడు ఎన్నికలు పూర్తయిన తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన సీనియర్ నేతలను ఆయా నియోజక వర్గంలో ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. వీరు ఆయా నియోజక వర్గంలో ఎన్నికల బాధ్యతల్లో ఉన్న మంత్రులతో సమన్వయం చేసుకుని గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆయా లోక్‌సభ నియోజక వర్గాల హస్తం పార్టీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు మండల, గ్రామ స్థాయి వర కు ప్రచారాన్ని దూకుడుగా తీసుకుపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు వారికి పట్టున్న ప్రాంతాలలో హస్తం పార్టీ ఓట్లు పెంచే బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. ఈ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో మంచి పనితీరు కనబరచిన నేతలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ కమిటీల్లో స్థానం కల్పిస్తామనే హామీతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి, కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ, హస్తం గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.
Also Read: నవనీత్ కౌర్‌కు షాక్.. షాద్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు
అగ్రనేతల అండతో బీజేపీ
ఈ ఎన్నికల్లో తగిన సీట్లు సాధించి, విపక్ష బీఆర్ఎస్ పోషించే స్థానాన్ని భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే, రాష్ట్ర బీజేపీకి ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకులు లేరు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాను పోటీ చేసే సికింద్రాబాద్ సీటుకు, మరో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన కరీంనగర్ సీటుకే పరిమితమయ్యారు. ఈటల, రఘనందన్ రావు, అరవింద్ వంటి వారిదీ ఇదే పరిస్థితి. దీంతో ఆ పార్టీ ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతల చరిష్మా మీదనే ఆధారపడుతున్నారు. మూడేసి లోక్‌సభ సీట్లకు ఒకచోట బహిరంగ సభలు పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ తెలంగాణలో ఎన్నడూ అధికారంలో లేకపోవటంతో తానుగా ఇక్కడ చేసింది చెప్పుకోవటానికీ ఏమీ లేదు. దీంతో కేంద్ర పథకాలు, అయోధ్య రామాలయం, హిందుత్వ అంశాల ప్రాతిపదికనే ప్రచారం చేసుకుంటున్నారు. మరో సమస్య ఏమిటంటే బీజేపీకి తెలంగాణలో వ్యవస్థాగతమైన పార్టీ నిర్మాణం లేదు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ, ఆయా నేతలెవరూ క్రియాశీలంగా లేరు. దీంతో ఎన్నికల వేళ బూత్ ఏజెంట్ల కోసం కూడా వారు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇదిగాక, ఇక్కడి బీజేపీ బండారు దత్తాత్రేయ, ప్రొ. లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, మురళీధర్ రావు ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. వీరుగాక కొత్తగా పార్టీలోకి చేరిన వారంతా మరో వర్గంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బూర నర్సయ్య గౌడ్ వంటి బీసీ నేతల మధ్య కొన్ని అపోహలూ నడుస్తున్నాయి. ఒకవేళ రేపు కేంద్రంలో బీజేపీ గెలిస్తే, బీసీ కోటాలో ఎవరికి మంత్రి పదవి వస్తుందోననే అనుమానంతో వీరు సొంతపార్టీ వారికే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
జోరు లేని కారు..
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అసలు పోటీలో ఉందా లేదా అన్నట్లుగా ఆ పార్టీ ప్రచారం సాగుతోంది. కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఆ పార్టీ డల్ కావటం, అధినేత కేసీఆర్ తుంటి గాయం కారణంగా.. ప్రచారంలో కారు బాగా వెనకబడింది. దీనికి తోడు బీఫామ్‌ల పంచాయితీ మరింత టైం తినేసింది. దీంతో రైతులను పరామర్శ పేరుతో కేసీఆర్ స్వయంగా ప్రచార బరిలో దిగినా.. కొన్ని జిల్లాలకే పరిమితమయ్యారు. దీనికి తోడు ఆయన బస్సు యాత్ర 5 నియోజక వర్గాల్లో సాగటం లేదని, ఆ అయిదు సీట్లు ఆయన బీజేపీకి వదిలేశారనే ప్రచారం సాగటంతో ఆ సీట్లలో నేతలు ఇంటిపట్టునే కాలక్షేపం చేస్తున్నారు. వరంగల్ వంటి సీట్లలో ఎన్నికల ఖర్చుకోసం పార్టీ అధిష్ఠానం పంపిన ఫండ్‌ను మాజీమంత్రి, అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు పంచుకుని పైపైన ప్రచారం చేస్తున్న సంగతీ తాజాగా బయటికి వచ్చింది. దీంతో అక్కడి అభ్యర్థులే ప్రచార బాధ్యతలు తీసుకుని పర్యటిస్తున్నారు. అటు పార్టీ అధిష్ఠానం నుంచి ఫండ్, హామీలు పెద్దగా లేకపోవటంతో ఉన్నంతలో ఉదయం, సాయంత్రాలు ప్రచారం చేసి మమ అనిపించుకుంటున్నారు. రోజురోజుకూ తమ పార్టీ నుంచి పెరుగుతున్న వలసలు కూడా నేతలకు ప్రచారం మీద ఆసక్తి లేకుండా పోవటానికి కారణమవుతోంది.