Radhakishan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారు. వారంపాటు పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అంగీకరించింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. తొలుత ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లబోతున్నారు. అక్కడే వారం రోజులపాటు రాధాకిషన్ రావును పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి ప్రశ్నించనున్నారు. మరోవైపు భుజంగరావును కూడా కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన రాధాకిషన్ రావు సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సుప్రీమ్ ఆదేశాలతోనే ఈ వ్యవహారం జరిగిందని చెప్పారు. మునుగోడు, దుబ్బాక బైపోల్ సమయంలో ప్రత్యర్థులకు చెందిన కోట్ల రూపాయాలను సీజ్ చేశామని, అధికార పార్టీ డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించామనీ పోలీసులకు వెల్లడించారు. రాధాకిషన్ రావు ఎస్ఐబీ ఓఎస్డీ వేణుగోపాల్ రావు పేరును బయటపెట్టారు. దీంతో పోలీసులు వేణుగోపాల్ రావును అదుపులోకి తీసుకున్నారు. నిన్న 11 గంటల పాటు ఆయనను విచారించారు. వేణుగోపాల్ రావు దర్యాప్తులో పోలీసులకు వెల్లడించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేవు.
Also Read: పాపం మూగజీవాలు.. దాహంతో ట్యాంకులోకి దిగి 30 కోతుల మృత్యువాత
ఫోన్ ట్యాపింగ్ కేసులో సేకరించిన సమాచారం ఆధారంగా అనుమానిత పెద్ద తలకాయలకు నోటీసులు పంపాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకు సరైన ఆధారాలు సమకూర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాధాకిషన్ రావును మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా భుజంగరావును కూడా ప్రశ్నించాలని అనుకుంటున్నారు. ఇక ప్రభాకర్ రావు కూడా అమెరికా నుంచి తిరిగి వస్తే విచారించాలని భావిస్తున్నారు. ప్రభాకర్ రావును విచారించిన తర్వాత కేసు మరో మలుపు తిరుగనుంది. ఆయనకు ఆదేశాలు ఇచ్చిన వారి పేరు బయటకు వచ్చే ఆస్కారం ఉన్నది. అప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారులకు కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నది.