- పోలింగ్ ను బహిష్కరించిన తెలంగాణలో కొన్ని గ్రామాలు
- తమ సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం
- ఓటు విలువ తెలియక ఓటెయ్యని పట్టణ ఓటర్లు
- ఒక్క ఓటు తో తారుమారైన ఫలితాలు
- ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవి కోల్పోయిన వాజ్ పేయి
- ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిన రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి
- 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) అభ్యర్థి ఓటమి
Ban the elections some rural areas of Telangana sensational decision:
బాధ్యత గలిగిన పౌరులంతా ఓటెయ్యాలి అంటుంటారు. ఓటే మనకున్న వజ్రాయుధం అంటారు. అయితే తెలంగాణలోని కొన్న గ్రామాలు ఏకంగా ఓటింగ్ బహిష్కరించారు. తాము ఓట్లేయమని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ 2024 ఎన్నికలలో తెలంగాణలో కొన్ని గ్రామాలలో ఓటర్లు ఏకంగా ఓటును బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ వారు నిరసన తెలిపారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్థులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఇక్కడి రైతులు ధర్నా చేపట్టారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. కడెం మండలం అల్లంపల్లిలో గ్రామస్థులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదు. తమ ఊరి రోడ్డు సమస్యను తీర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. మైనింగ్ ఎన్‌వోసీ అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు మనం ఓటెయ్యకుంటే ఏం జరగుతుందో తెలుసా?
ఓటెయ్యకుంటే ఏం జరుగుతుంది?
ఫలానా పార్టీ గెలుస్తుంది..ఫలానా పార్టీ ఓడిపోతుంది..ఈ సారి ఎన్నికల మూడ్ ఎలా ఉంది? ఏ నాయుకుడు గెలుస్తాడు అంటూ ఎన్నికల సమయంలో ఏ ఇద్దరు కలుసుకున్నా ఇవే కబుర్లు. ఇక ప్రచారంలో ఆ పార్టీకి ఓటేస్తే మీకు అన్యాయం జరుగుంది. మా పార్టీతోనే మీకు న్యాయం జరుగుందని రాజకీయ నాయకులు ఊదరగొట్టేస్తుంటారు. అయితే ఎన్నికల సమయంలో కొందరు ఎవరికి ఓటేసినా మన రాతలు మారవు కదా అని ఓటెయ్యడమే మానేస్తుంటారు. కొందరు కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు పడేలా చేసుకుంటారు. చాలా మందికి మనసులో మెదిలే ప్రశ్న అసలు మనం ఓటెయ్యకపోతే ఏమవుతుంది? చదువుకోని పల్లెల్లో ఎక్కువ శాతం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటుంటే..చదువుకున్న పట్టణాల ఓటర్లు ఓటెయ్యడానికి నిరాసక్తత కనబరుస్తుంటారు. అసలు నా ఒక్కడి ఓటెయ్యకపోతే ఏదైనా ప్రళయం వస్తుందా అనుకునేవారు కూడా ఉన్నారు. దీనికి కారణం వారి ఓటు విలువ తెలియకపోవడమే. కేవలం ఒక్క ఓటు తేడాతో అనేక అద్భుతాలు జరిగాయి. కొన్ని ప్రభుత్వాలు నిలిస్తే..మరికొన్ని కూలిపోయాయి. నేతల రాతలే ఒక్క ఓటు మార్చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఒకే ఒక్క ఓటు తో ప్రధాని భవితవ్యం తారుమారు
పార్లమెంటులో ఒక్క ఓటు ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తన పదవిని కోల్పోయారు. 1999లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే ఉండేది. ఆమె పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 1999 ఏప్రిల్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది. విపక్షాల్లో ఎవరికీ మెజార్టీ లేకపోవడంతో లోక్‌సభ రద్దయింది.2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతెమరహళ్లి (ఎస్సీ) స్థానంలో జనతాదళ్ (సెక్యులర్) తరఫున ఏఆర్ కృష్ణమూర్తి, కాంగ్రెస్ తరఫున ధ్రువ నారాయణ పోటీ చేశారు. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, ధ్రువనారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి. దీంతో కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఓటమి చవిచూశారు. అనంతరం ఆయన ఓ పత్రిక ముఖాముఖిలో మాట్లాడుతూ.. తన బద్ధశత్రువు కూడా ఒక్క ఓటుతో ఓడిపోవాలని కోరుకోడని వ్యాఖ్యానించారు. ఎన్నికల రోజు ఓటు వేయాలనుకున్న తన డ్రైవర్‌కు ఏఆర్ కృష్ణమూర్తి సమయం ఇవ్వకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయినట్లు తర్వాత కథనాలు వెలువడ్డాయి.
రాజస్థాన్ సీఎం ఛాన్స్ మిస్సింగ్
రాజస్థాన్ లో 2008 శాసనసభ ఎన్నికలలో నాత్ ద్వార అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సీసీ జోషి, బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్ చౌహాన్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో చౌహాన్కు 62,216 ఓట్లు వచ్చాయి. జోషికి 62,215 ఓట్లు రావడంతో ఓటమి పాలయ్యారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓటమి పాలవడం శోచనీయం. . జోషి తల్లి, సోదరి, డ్రైవర్.. ఎన్నికల రోజు ఓట్లు వేయడానికి వెళ్లలేదు. ఈ ముగ్గురూ ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం వేరేగా ఉండేది. ఆ ఎన్నికల్లో జోషి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా సీఎం రేసులో ముందున్నారు. పార్టీని విజయపథంలో నడిపించినా ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సీఎం అయ్యే అవకాశాన్నీ కోల్పోయారు. మిజోరంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుయివాల్ (ఎస్టీ) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌ఎల్ పియాన్మావియా మూడు ఓట్లతో ఓడిపోయారు. అక్కడ మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అభ్యర్థి లాల్‌చంద్‌మా రాల్టేకు 5 వేల 207 ఓట్లు వచ్చాయి. పియాన్మావియాకు 5 వేల 204 ఓట్లు పోలయ్యా.ి రీకౌంటింగ్‌లోనూ ఎలాంటి మార్పూ లేకపోవడంతో పియాన్మావియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.