Objection to Election Commission’s silence : దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం జోరుగా సాగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడమనేది కత్తి మీద సాములాంటిదే. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును పరిశీలిస్తే అందులో ఎన్నో మెరుపులు, కొన్ని నిరుత్సాహం కలిగించే నిర్ణయాలూ ఉన్నాయి. ఒకప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం భారత ప్రభుత్వంలో భాగమని చాలామంది అపోహపడేవారు. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల సంఘం అధికారులు సైతం కేంద్రం మనసెరిగి ప్రవర్తించేవారు. కానీ, 1990 డిసెంబరు 12న ఆ పరిస్థితి మారిపోయింది. కారణం- ఆరోజు టి.ఎన్.శేషన్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా బాధ్యతలు చేపట్టడమే! వచ్చీ రాగానే, భారత రాజ్యాంగం ఎన్నికల సంఘాన్ని ఒక స్వతంత్ర సంస్థగా పేర్కొన్న విషయాన్ని ఆయన దేశం ముందు పెట్టారు. అంతేకాదు.. అందుకు తగినట్లుగా ఎన్నికల సంఘం పనిచేసేలా క్రియాశీలంగా పనిచేశారు 1996 డిసెంబరు 11న తన పదవీకాలం ముగిసే దాకా శేషన్ మన రాజ్యాంగానికి, ఎన్నికల సంఘానికి ఉన్న సత్తా ఏమిటో దేశానికి చూపించారు. అప్పటి నుంచే దేశంలో ఎన్నికల సంఘం అనేది ఒక వ్యవస్థ ఒకటి ఉన్నదనే నమ్మకాన్ని దేశ ప్రజలకు కలిగింది. కానీ, నేటి సార్వత్రిక ఎన్నికల్లో నాయకుల వీరంగాలు, వాటిపై ఎన్నికల సంఘం చూసీచూడనట్లు పోవటాన్ని చూస్తుంటే.. ఎన్నికల సంఘం అసలు పనిచేస్తోందా అనే అనుమానాలూ వస్తున్నాయి.
పార్లమెంటరీ విధానంలో ఎన్నికలు విడదీయలేని ముఖ్యమైన అంతర్భాగం. రాజకీయాలకు నిజమైన అధికారం ఇచ్చేది ఎన్నికలు మాత్రమే. అయితే ఆ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామిక స్ఫూర్తితో జరిగినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడలో నిలవగలుగుతుంది. అలా జరగనప్పుడు ఆ ప్రజాస్వామ్యం నిజంగా ప్రమాదంలో పడినట్టే. మన దేశంలో తొలి రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు దాదాపుగా లేవు. ఎన్నికలు ఎంతో స్వేచ్ఛగా జరిగిన ఎన్నికలమది. కాలం గడుస్తున్న కొద్దీ విలువల్లో క్షీణత మొదలైంది. దీంతోపాటే అవినీతి పెరిగిపోయింది. అప్పట్లో ప్రజాపోరాటాల ద్వారా నాయకులు చట్టసభల్లో ప్రవేశించేవారు. కాలక్రమంలో నేతలు నేరుగా పార్టీ కార్యాలయాల్లోంచి ప్రత్యక్షమవుతున్నారు. అప్పట్లో ముక్కు సూటిగా, నిజాయితీగా, నిస్వార్ధంగా, ప్రజాసేవే ధ్యేయంగా నాయకులకు పార్టీలకతీతంగా జనం ఓట్లేసేవారు. నేడు అలాంటి వారి గురించిన చర్చ అనేదే ప్రస్తావనకు రావటం లేదు. చట్టసభలకు ఎన్నికైన ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో దాదాపు 30 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. మరి ఇన్నిరకాల అవలక్షణాల నుంచి మన ఎన్నికల సంఘాన్ని పనిచేయకుండా చేస్తున్న శక్తులేమిటనే చర్చ నేడు జరుగుతోంది.
గత మార్చిలో ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా సంభవించిన పరిణామం కావటంతో దేశవ్యాప్తంగా ఈ వార్తకు ప్రాధాన్యం లభించింది. దీనికి తోడు అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం పూర్తి అయినందున పోస్ట్ ఖాళీగా ఉంది. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే పదవిలో మిగిలారు. ఆ వెంటనే కేంద్ర మరో ఇద్దరు కమిషనర్లను నియమించింది. గతంలో ఎన్నికల కమిషనర్‌ను నియమించే కమిటీలో ప్రధాని, లోక్‌సభ విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండేవారు. కానీ, మోదీ ప్రభుత్వం ఈ కమిటీలో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి, ఆ స్థానంలో కేబినెట్ మంత్రిని నియమించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టాన్ని సవాలు చేసేందుకు ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం (ఏడీఆర్), కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాగూర్ సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాబోయే ఒక్కరోజు ముందు మోదీ ప్రభుత్వం ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. ఎన్నికల సంఘాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నంగా దీనిని విపక్షాలతో బాటు పలువురు సామాజిక వేత్తలు విమర్శించారు.
ఇక ప్రస్తుత లోక్‌సభ ఎన్నిక ప్రచారంలో ప్రధాని మోదీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆయన మీద ఎన్నికల సంఘం వేటు వేయటం ఖాయమని పలువురు భావించారు. ఎన్నికల సంఘం తనను ఏమీ చేయలేదనుకున్నారేమో గానీ, ప్రధాని మర్నాడు ఉత్తర ప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇదేంటి’ అంటూ దేశవ్యాప్తంగా దీనిపై గగ్గోలు పెట్టాకగానీ, ఎన్నికల సంఘం స్పందించలేదు. అసత్యాలను ప్రచారం చేసే వారిని సహించేదే లేదని, అలాంటి వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోబోమనే మాటకే ఎన్నికల కమిషన్ ప్రధానాధానాధికారి రాజీవ్ కుమార్ పరిమితమయ్యారు. మనదేశంలో ఎవరు ఏ ఆహారం తినాలనేది ప్రజల వ్యక్తిగత నిర్ణయం. కానీ, ప్రధాని మోదీ ‘చైత్ర నవరాత్రుల్లో మాంసం, చేపలు తింటున్నారు’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని వర్గాల వారిని ఆక్షేపించారు. ఈ వెంటనే కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చూస్తే ఆ పార్టీ నేతల మొఘల్ మానసికత అర్థమవుతుందని, అందులో తనకు ముస్లింలీగ్ సిద్ధాంతం కనిపించిందన్న ప్రధాని మాటలూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాని పార్టీలకు ఓటెలా వేస్తారని ప్రధాని మోదీ మొహమాటం లేకుండా ప్రచార సభల్లో ఓటర్లను అడిగారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సమయంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్న సురక్షితమైన షెల్టర్‌ను రాహుల్ గాంధీ ఎంచుకున్నారంటూ గత ఎన్నికల వేళ కూడా ప్రధాని ఎద్దేవా చేశారు. అయినా, ఈసీ ప్రధానికి ఒక హెచ్చరిక నోటీసు కూడా జారీచేయలేకపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు దేశంలోని మీడియా అందరి ముందు అసత్యాలను, విద్వేష పూరిత ప్రసంగాలను కఠినంగా అణిచి పారేస్తామని చెప్పిన రాజీవ్ కుమార్ ఈయనేనా అనికూడా అనిపించింది.
అలాగని కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఎలాంటి చర్యలు తీసుకోకుండానూ లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ప్రస్తుత మధుర బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటి హేమ మాలిని మీద ఏవో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై రెండు రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆంక్షలు విధించారు. తెలంగాణలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణం చూపుతూ మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలుపుదల చేయించింది. నటి కంగనా రనౌత్‌ను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనతే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘నాలాయక్ బేటా’ (Useless son) అని సంబోధించిన ప్రియాంక్ ఖర్గేకు కూడా ఈసీ నోటీసులు అందుకోవాల్సిన వచ్చింది. ఈసీ చర్యలు తీసుకున్న నేతల్లో మెజారిటీ విపక్షానికి చెందిన వారు కావటం, అతి తక్కువ సందర్భాల్లోనే అధికార పార్టీ నేతల మీద చర్యలు తీసుకుందనే విమర్శలూ ఉన్నాయి.
మన రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని మరో ఇద్దరు కమిషనర్లను ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. నియమకాలు ప్రభుత్వం ద్వారానే జరుగుతాయి. అందులో ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలూ లేవు. కానీ, ఎవరిని నియమిస్తున్నారు? ఆ ప్రక్రియ ఎంత పారదర్శకంగా ఉంది? నియమాలకు లోబడే ఈ ప్రక్రియ సాగుతోందా? అనేదే ఇక్కడ ప్రశ్న. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం… ఎన్నికల కమిషనర్ ఎంపిక కమిటీలో ప్రధాని, విపక్షనేత, కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. వీరిలో ఇద్దరు సభ్యుల అభిప్రాయం ఎటు ఉంటే వారి మాటే చెల్లుతుంది. ఈ లెక్కన ప్రభుత్వానికి నచ్చిన వారే కమిషనర్లుగా ఎన్నికవుతారని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇలా నియమితులైన కమిషనర్లు ప్రధానమంత్రితో తలపడాల్సి వస్తే, వారు ప్రధాని మీద చర్యలు తీసుకోగలరా? అంటే లేదనే జవాబొస్తోంది. అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ ఉన్నట్లుగానే, ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం అప్పుడైనా ఈ లోక్‌సభ వేళ మనం చూస్తున్న నేతల వీరంగాలు కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.
సదాశివరావు ఇక్కుర్తి
సీనియర్ జర్నలిస్ట్