Telangana Rains: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నట్టు సోమవారం వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను ఆదివారమే తాకాయి. సాధారణంగా మే 22వ తేదీన దక్షిణ అండమాన్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకుతుంటాయి. కానీ, ఈ సారి మూడు రోజులు ముందగానే చేరాయి. ఈ నెల చివరలో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ సారికి వర్షాలు సాధారణం కంటే ఎక్కువే కురిసే అవకాశం ఉన్నదని ఇది వరకే భారత వాతావరణ శాఖ పేర్కొంది. మే 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 24వ తేదీ నాటికీ అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.
సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనాలు వేస్తుంటారు. ఈ సారి కొంత ముందుగానే తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల చివరిలో కేరళ తీరాన్ని తాకి.. జూన్ 8 నుంచి 11వ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే చాన్స్ ఉన్నది. ఇప్పటికే తెలంగాణలో మధ్యాహ్నం పూట ఎండలు కాస్తున్నా సాయంత్రానికల్లా వాతావరణం చల్లబడుతున్నది. ఎక్కడో ఓ చోట వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి మరో నాలుగు రోజలు రాష్ట్రంలో తేలికాపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ ఈశాన్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
అలాగే.. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నది. రాజధాని నగరంలోనూ తేలికపాటి జల్లులు పడుతాయి.