– 560 నామినేషన్ల దాఖలు
– కంటోన్మెంట్ సీటుకు 39 నామినేషన్లు
– అత్యధికం మల్కాజ్‌గిరి, అత్యల్పం నాగర్ కర్నూల్
– చివరి రోజు నామినేషన్ వేసిన బండి, అర్వింద్, మాధవీ లత, బాబూ మోహన్
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. ఏప్రిల్ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగియనుందున చివరి రోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. చాలాచోట్ల సీట్లు దక్కని ప్రధాన పార్టీ అసంతృప్తులు భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలిసి ర్యాలీగా నామినేషన్లు వేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు సుమారు 572 మంది నామినేషన్లు వేయగా, కంటోన్మెంట్ స్థానంలో 38 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలుంది. ఏప్రిల్ 29 సాయంత్రానికి బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Also Read: Lok Sabha Elections: మూడు పార్టీల అభ్యర్థులు వీరే.. ఫుల్ లిస్ట్
స్థానాల వారీగా చూస్తే, ఆదిలాబాద్‌లో 39, భువనగిరిలో 81, చేవెళ్లలో 59, హైదరాబాద్‌లో 48, కరీంనగర్‌లో 69 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మంలో 57, మహబూబాబాద్‌లో 32, మహబూబ్ నగర్‌లో 42, మల్కాజిగిరిలో 101 మంది పోటీపడ్డారు. మెదక్ స్థానానికి 55, నల్గొండలో 85, నిజమాబాద్‌లో 77, పెద్దపల్లి 74, సికింద్రాబాద్‌లో 60, వరంగల్‌లో 62, జహీరాబాద్‌లో 41, నాగర్ కర్నూల్‌లో 23 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో పాల్గొనేందుకు 38 మంది నామినేషన్లు వేశారు.
కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, వరంగల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటుడు బాబూ మోహన్ చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు.