– ఫలించిన పార్టీల బుజ్జగింపులు
– 17 సీట్లు.. 525 మంది అభ్యర్థులు
– ఇక ఈవీఎం ఏర్పాట్లపై ఈసీ దృష్టి
Nominations: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్కో ఎంపీ స్థానంలో ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను 625 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లకు గానూ మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 268 నామినేషన్లు రిజెక్ట్ కాగా 625 నామినేషన్లు మిగిలాయి. పార్టీల బుజ్జగింపులతో 100 మంది నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో 17 లోక్‌సభ స్థానాల్లో అంతిమంగా 525 మంది ఎన్నికల బరిలో నిలవనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్‌సభకు 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్‌సభకు 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కరీంనగర్ ఎంపీ బరిలో 28 మంది అభ్యర్థులు నిలవగా.. ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. భువనగిరి ఎంపీ బరిలో 39 మంది నిలిచారు. ఈ స్థానం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఖమ్మం ఎంపీ బరిలో 35 మంది పోటీలో ఉండగా.. ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. వరంగల్ ఎంపీ బరిలో మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. మెదక్ ఎంపీ బరిలో 44 మంది, మహబూబాబాద్ ఎంపీ బరిలో 23 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా, ఇద్దరు అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకున్నారు. జహీరాబాద్‌లో 19 మంది పోటీలో ఉండగా.. ఏడుగురు అభ్యర్థులు డ్రాప్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ బరిలో నుంచి ఏడుగురు అభ్యర్థులు తప్పుకోగా.. మొత్తం 42 మంది పోటీలో ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో 8 మంది అభ్యర్థులు తప్పుకోగా.. 30 మంది బరిలో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బరి నుంచి ముగ్గురు తప్పుకోగా 29 మంది పోటీలో ఉన్నారు. మెదక్‌లో 44, మల్కాజిగిరిలో 22, హైదరాబాద్‌లో 30, చేవెళ్లలో 43, మహబూబ్‌నగర్‌లో31, నాగర్ కర్నూల్‌లో 19, నల్గొండలో 22, వరంగల్‌లో 42, మహబూబాబాద్‌లో 23, ఖమ్మంలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: ఎన్నికల వేళ బీజేపీ డ్రామా.. నోటీసులు రాకుండానే సీఎం రేవంత్‌కు ఇచ్చారంటూ ప్రచారం
మరోవైపు.. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావటంతో ఎన్నికల సంఘం ఆయా స్థానాల్లోని పోలింగ్ బూత్‌లలో ఎన్ని ఈవీఎం యూనిట్లు పెట్టాలనేదానిపై దృష్టి సారించనుంది. ఏ స్థానంలోనైనా 15 మంది లేదా ఆ లోపు అభ్యర్థులు పోటీలో నిలిస్తే, ఒక ఈవీఎం సరిపోతుంది. అభ్యర్థుల సంఖ్య 16-31 మధ్యలో ఉంటే రెండు, అభ్యర్థుల సంఖ్య 32 -47 మధ్య ఉంటే మూడు ఈవీఎం యూనిట్లను వాడాల్సి ఉండనుంది. 48–63 మధ్యలో ఉంటే నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించక తప్పదు.