– గతంలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
– ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత మిగిలిన వాటిపై కసరత్తు
– ఆలయాలు, గ్రంథాలయాలకు పాలక మండళ్లు
– కొత్తగా మరో రెండు కార్పొరేషన్ల ఏర్పాటు?
– గ్రేటర్‌లో పట్టుపెంచుకునే దిశగా చర్యలు
– పంచాయితీ, స్థానిక ఎన్నికల నాటికి బలపడేందుకే
Congress: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావటంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగానే, గత పదేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన నేతలు, కార్యకర్తలను గుర్తించి వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అంశం మీదా టీపీసీసీ దృష్టిసారించనుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే 37 మందికి కార్పొరేషన్ పదవులను ప్రకటించిన హస్తం పార్టీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మిగిలిన పదవులను ప్రకటించి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ కావాలని పీసీసీ భావిస్తోంది. గతంలో ప్రకటించిన కార్పొరేషన్ ఛైర్మన్లలో చాలామంది ఎన్నికల కోడ్ కారణంగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. జూన్ 6 నాటికి ఎన్నికల కోడ్ ముగియగానే వారికి ఆర్డర్ కాపీలను అందించనున్నారు.
మరో 15 పోస్టులపై కసరత్తు
గతంలో భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులలో పెండింగ్‌లో పెట్టిన ఆర్టీసీ, సివిల్ సప్లయ్, బేవరేజెస్, రెడ్కో(రెన్యువబుల్‌ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ), మూసీ రివర్ ఫ్రంట్, హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) వంటి కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంపై సీఎం రేవంత్ దృష్టిపెట్టారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినవారు, అనేక ఇబ్బందులను అధిగమించి పార్టీ జెండా మోసిన నేతలకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలకు నామినేటెడ్ పదవులిచ్చేందుకు పార్టీ నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నందున వారికి ఆయా నియోజక వర్గాల బాధ్యతలనే అప్పజెప్పటం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి అక్కడ పార్టీని బలోపేతం చేయనున్నట్లు సమాచారం.
అర్హతే ప్రాతిపదికగా..
ఈ నామినేటెడ్ పదవుల విషయంలో ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు జిల్లాల వారీగా పది వరకు పేర్లను సిఫారసు చేయటం, వాటిని వడపోసి, అంతిమంగా క్షేత్ర పరిస్థితులు, పార్టీకి సదరు నేతలు అందించిన సేవలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా ఎంపిక చేపట్టనున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మందు వేరే పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి, చిత్తశుద్ధితో పనిచేసి, మంచి ఫలితాలు సాధించటంతో కీలక పాత్ర పోషించిన నేతలకూ ఈ క్రమంలో ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో స్థానిక నేతల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కూడా పీసీసీ భావిస్తోంది.
కొత్తగా రెండు కార్పొరేషన్లు?
వీటితో పాటు విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటుపైనా పీసీసీ దృష్టిపెట్టినట్లు సమాచారం. విద్యాకమిషన్‌కు రాజకీయాలతో సంబంధం లేని, ఆ రంగంలో దీర్ఘకాలం పనిచేసిన ఐఏఎస్ అధికారులను నియమించటం ద్వారా దెబ్బతిన్న విద్యా వ్యవస్థకు జవసత్వాలు తేవాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే, వ్యవసాయ కమిషన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అయితే బాగుంటుందని పలువురు నేతలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుతో తెలంగాణ రైతాంగాన్ని బలోపేతం చేయొచ్చని హస్తం పార్టీ విశ్వసిస్తోంది.
ఆలయాలకు పాలక మండళ్లు..
రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర, కీసరగుట్ట, మహంకాళి ఆలయం, కొమురవెల్లి, కురవి, ధర్మపురి వంటి అనేక ప్రముఖ దేవాలయాలతో బాటు పలు చిన్న ఆలయాలకూ పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. ఈ పాలక మండళ్ల భర్తీ ద్వారా కూడా మరికొందరికి పదవుల భాగ్యం దక్కనుంది. అలాగే మార్కెట్ కమిటీ పాలక మండళ్లను కూడా భర్తీ చేయాల్సివుంది. ఇవిగాక ఇవిగాక 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఈ పదవులకు రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది కనుక రాబోయే నాలుగున్నరేళ్ల కాలంలో రెండు సార్లు ఈ నియమాకాలు చేయటం ద్వారా ఎక్కువ మంది నేతలకు గుర్తింపునివ్వటం సాధ్యమవుతుందని హస్తం పార్టీ భావిస్తోంది.
స్థానికానికీ సన్నద్ధం
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీతో బాటు మిగిలిన హామీలను రాబోయే మూడు నెలల్లో అమలు చేసి, తర్వాత పంచాయతీ మొదలు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా పీసీసీ యోచిస్తోంది. గడచిన జనవరి 31తో రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. ఆ వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సివుంది. వీటితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు, డీసీసీబీ చైర్మన్ల ఎన్నికలు, చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఈ ఎన్నికలన్నింటికీ క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ బలంగా ఢీకొట్టటం ద్వారా రాబోయే ఐదేళ్ల పాటు హస్తం హవా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గత పదేళ్లుగా క్షేత్రస్థాయి పోరాటాల్లో ముందున్న పార్టీ నేతలకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా వారు మరింత ఉత్సాహంగా పనిచేయగలరని పార్టీ నమ్ముతోంది.
గ్రేటర్‌కు పెద్దపీట
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నగర పరిధిలోని నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పించటం ద్వారా రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని ప్రజలకు చేరువ చేయాలని హస్తం అధినాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో డివిజన్ల వారీగా చురుగ్గా ఉన్న నేతలను గుర్తించి, వారికి క్షేత్రస్థాయి బాధ్యతలను అప్పగించటం ద్వారా కొత్త నాయకత్వాన్ని తయారుచేయటం, తద్వారా నగర పాలక సంస్థ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే కోణంలోనూ పీసీసీ ప్రణాళికలు రచిస్తోంది.