- రెండు నెలల్లో రూ.8 వేల కోట్ల అదనపు ఆదాయం
- కలిసొస్తున్న సర్కారు పొదుపు చర్యలు
- కోడ్ కారణంగా దొరికిన బ్రీతింగ్ టైమ్
- ఊపందుకున్న పన్నుల వసూళ్లు
- హామీల అమలుకే రెండునెలల్లో రూ. రూ.5 వేల కోట్లు
No Wastage, Recovering Treasury : ఆర్థిక లోటుతో సతమతమవుతున్న తెలంగాణ సర్కారు క్రమంగా ఆ పరిస్థితిని అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలు, వసూళ్ల మీద దృష్టి సారించటంతో క్రమంగా ఆదాయం పెరుగుతోంది. దీనికి తోడు ఎన్నికల కోడ్ రావటంతో కొత్త పథకాలు అమలు చేసే వీలు లేనందున రెండు నెలల సమయం కలిసొచ్చినట్లయింది.
2023 నవంబరు వరకు తెలంగాణ ప్రభుత్వానికి నెలకు రూ. 10 వేల కోట్ల రూపాయల లోపే ఆదాయం ఉండేది. కానీ, 2023 డిసెంబరు, 2024 జనవరి నెలల్లో తెలంగాణకు రూ. 28,425 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే సుమారు రూ. 8 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరినట్లయింది. ఈ రెండు నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు ఖర్చుచేయగా, మరో రూ. 3 వేల కోట్ల మిగులు చేకూరినట్లయింది. మొత్తం ఆదాయంలో ఎక్సైజ్ ఆదాయం రూ.3,300 కోట్లు కాగా, జీఎస్టీ వసూళ్ల రూపంలో రూ.7,500 కోట్లు. హామీల అమలు, ఉద్యోగుల వేతనాలు, అప్పుల మీద చెల్లించాల్సిన వడ్డీలు, ఫించన్ల వ్యయం పోనూ, ప్రస్తుతం సర్కారు మిగులులోనే ఉంది. కాంగ్రెస్ వచ్చాక దుబారా తగ్గటం, లీకేజీలకు నివారించటంతో గత రెండు నెలల్లో అదనంగా రూ.8 వేల కోట్లు ఖజానాకు వచ్చినా ఖర్చులూ అంతే మొత్తంలో పెరుగుతున్నాయి.
Read Also : కారు దిగుతున్న బీఆర్ఎస్ నేతలు
ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రెవెన్యూ లక్ష్యం రూ. 2.16 లక్షల కోట్లు కాగా, 2023 నవంబర్ నాటికి రూ.1,49,316.41 కోట్లు సమకూరింది. 2024 జనవరి చివరికి అది రూ.1,77,742.13 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి (2024 మార్చి) ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని అధిగమించే దిశగా సాగుతోంది. అటు 2024 ఫిబ్రవరి నెల జీఎస్‌టీ వసూళ్లు ఏకంగా 18% పెరిగి, రూ.5,211 కోట్లు ఖజానాకు చేరాయి. నిరుడు ఇదే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.4,424 కోట్లుగా ఉన్నాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు రెండు నెలల కాలంలోనే ఫలితాన్నిస్తున్నాయి. సీఎం కార్యాలయం మొదలు అన్ని స్థాయిల్లో కో-టెర్మినస్ పోస్టులను తగ్గించటం, సీపీఆర్వో, పీఆర్వోలు సహా పలువురి వేతనాల్లో భారీగా కోత పెట్టటం, వారు వాడే వాహనాలపై ఆంక్షలు విధించటంతో బాటు మంత్రుల పేషీల్లో పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్.. లాంటి మినిస్టీరియల్ స్టాఫ్ వేతనాలనూ తగ్గించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ శాఖల బాధ్యతలు చూసే అధికారులు ఏదో ఒక శాఖ వాహనమే వాడేలా చూసి, తద్వారా ఆ మిగిలిన వాహనాలను వేరే శాఖలకు కేటాయించటం ద్వారా అద్దె వాహనాల ఖర్చు తగ్గించారు. సీఎం అయిన నెల రోజుల వరకూ కాన్వాయ్‌లో సొంత కారునే వాడిని సీఎం, ఆ తర్వాత గత సీఎం వాడిన కాన్వాయ్‌లోని వైట్ కలర్ కార్లకు బ్లాక్ కలర్ వేయించి వాటినే వాడుకోవటం, కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యనూ తగ్గించుకోవటం, సీఎం చాంబర్‌లో ఇంటీరియర్ పేరుతో ఏ ఖర్చూ పెట్టకపోవటంతో అన్ని స్థాయిల్లో కొంత జవాబుదారీతనం పెరిగింది.
Read Also : మల్కాజ్ గిరిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
గత ప్రభుత్వంలో టెండర్లు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో చేసిన పనుల్లో అనుమానాస్పదంగా ఉన్న వాటి బిల్లలు నిలిపివేశారు. జీహెచ్ఎంసీ మొదలు మునిసిపాలిటీల్లో పరిధిలో పెండింగ్‌లో ఉన్న పన్నుల వసూళ్లు వేగవంతం కావటం, ఆదాయంలోని లీకేజీల నివారణకు చర్యలు తీసుకోవటమూ ఖజానాకు కలిసొచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఎన్నికల కోడ్ రావటంతో సర్కారుకు మరింత వెసులుబాటు దొరికనట్లయింది. ఇక కాంగ్రెస్ ప్రకటించిన పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, మహిళలను నెలవారీ సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతుభరోసా కింద రూ.16 వేలుతో బాటు గతంలో ఉన్న పథకాల అమలుకు సర్కారు మీద ఏటా రూ.1.2 లక్షల కోట్ల భారం పడనుంది.
ఇందులో కాంగ్రెస్ ‘అభయ హస్తం’ పేరున ఇచ్చిన 6 హామీలకే రూ. 68,652 కోట్ల భారం పడనుంది. దీనికోసం గత తాత్కాలిక బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కూడా జరిగింది. అలాగే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీకి కనీసం పాతిక వేల కోట్ల రూపాయలు అవసరం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ హామీ అమలు కాస్త పక్కనబెట్టే వెసులుబాటు సర్కారుకు లభించినట్లయింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లను వేగవంతం చేయటం ద్వారా మార్చి నెలాఖరు నాటికి వాస్తవ ఆర్థిక పరిస్థితి మీద అంచనా వస్తుందని, తద్వారా రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోయే పూర్తి స్థాయి బడ్జెట్ రూపొందించుకొని, తొలి ఏడాదిలోనే ఆర్థిక లోటును పూడ్చుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.