Delhi CM Aravind Kejriwal
క్రైమ్

Delhi Liquor Case: కేజ్రీవాల్ కూడా ఇక తిహార్‌లోనే.. అరెస్టు సక్రమమేనంటా!

Aravind kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టును, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషనర్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని గుర్తు చేసింది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పువెలువరించారు.

అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిబంధనల ప్రకారమే అరెస్టు చేసిందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ అరెస్టు చట్ట విరుద్ధం కాదని పేర్కొంది. ఈ రోజు కోర్టులో ఉభయ పక్షాల మధ్య వాదనలు జరిగాయి. ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందంటే.. లేదు సక్రమంగానే అరెస్టు చేశామని ఈడీ పేర్కొంది. తనకు లిక్కర్ కేసుతో సంబంధమే లేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వాదించగా.. లిక్కర్ పాలసీ కేసులో అక్రమం జరిగిందని, అందులో కేజ్రీవాల్ పాత్ర ఉన్నదని ఈడీ ఆధారాలు చూపెట్టిందని కోర్టు పేర్కొంది.

Also Read: మెగా ఫ్యామిలీలో రెండు రాజకీయ పార్టీలా?

ఈడీ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో, మనీలాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నదన్న ఈడీ వాదనలను కన్సిడర్ చేసింది. ముడుపులు తీసుకోవడంలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నదని ఈడీ వాదించింది. ఎన్నికల్లో ఎవరు లబ్ది పొందారు? ఎలక్టోరల్ బాండ్లను ఎవరు కొనుగోలు చేశారనేది కోర్టుకు సంబంధించినది కాదని హైకోర్టు పేర్కొంది. ఇక కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

దర్యాప్తు సంస్థ తన విధానాలకు అనుగుణంగా నడుచుకుంటుందని, అంతేకానీ, ఒక వ్యక్తి సౌలభ్యానికి అనుగుణంగా విచారణ జరపాలని దర్యాప్తు సంస్థను ఆదేశించదని పేర్కొంది. సాధారణ పౌరుల పట్ల ముఖ్యమంత్రి పట్ల ఒకే విధంగా నడుచుకుంటుందని, ఎందుకంటే వేర్వేరు చట్టాలు ఉండవు కదా.. అందరికీ చట్టం సమానమే కదా అని వివరించింది.

Also Read: సూర్యగ్రహణం భారత్‌లో ఎందుకు కనిపించలేదు?

కేజ్రీవాల్ అరెస్టు చేయడానికి ఈడీ వద్ద సరిపడా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎన్నికలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం అతని అరెస్టు, రిమాండ్‌ను కోర్టు పరిశీలించాల్సి ఉన్నదని అభిప్రాయపడింది. విచారణకు హాజరుకాకుండా జాప్యం చేయడం కూడా ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండటానికి ఒక కారణం అని వివరించింది. జడ్జీలు చట్టానికి కట్టుబడి ఉంటారని, కానీ, రాజకీయాలకు కాదని తెలిపింది. అలాగే.. తీర్పులు కూడా చట్ట సూత్రాల ద్వారా ఇస్తామని, రాజకీయంగా కాదనీ పేర్కొంది. కోర్టు ముందు కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వ వివాదం లేదని స్పష్టం చేసింది. ఇది కేజ్రీవాల్, ఈడీ మధ్య నడుస్తున్న కేసు అని తెలిపింది.

అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21వ తేదీన అరెస్టు చేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆయన ఢిల్లీ తిహార్‌ జైలులోనే ఉంటారు.