No Politics On Farmer Loan Waiver: వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. రైతుని రాజుని చేస్తాం. మా ప్రభుత్వ ప్రాధాన్యత ఇదే అని పాలించే ఏ ప్రభుత్వమైనా ముందు చెప్పే మాటలివే. కానీ, ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతంలో రైతు రాజు కాకపోగా రుణగ్రస్తుడిగా మారిపోయాడు. ప్రముఖ ఆర్థికవేత్త ఆర్థర్ లూయిస్ చెప్పినట్లు భారతదేశంలోని రైతు అప్పులో పుట్టి, అప్పులో పెరిగి అప్పుతోనే మరణించి, ఆ అప్పులను వారసులకు వారసత్వంగా అందిస్తున్నారనేది నేటికీ అక్షర సత్యం. వ్యవసాయం లాభసాటిగా మారకపోవడం, సేద్యం ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు రుణాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. రుణభారం పెరగటంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్ఎస్ఎస్ఓ అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశంలో రైతుల ఆత్మహత్యలలో మహారాష్ట్ర, కర్ణాటక తరువాత తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో 2022లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులను ఆదుకోవటానికి, వారిని రుణ విముక్తులను చేయటానికి రెండు లక్షల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేస్తామనే హామీ ఇచ్చింది.
ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయడానికి వివిధ మార్గాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఒకేసారి 40 వేల కోట్ల రూపాయలను మాఫీ చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి అంత తేలికైన విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రుణమాఫీ కోసం మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలోనే లోక్ సభ ఎన్నికలు రావడం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రయత్నాలు కొనసాగలేదనే చెప్పాలి. కానీ, మే 13న లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15 లోపు రైతుల రుణాలను మాఫీ చేయడానికి, ప్రభుత్వ ప్రయత్నాలకి కేబినెట్‌లో చర్చించటానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా, తర్వాత కూడా విపక్షాలు రైతు రుణమాఫీని ఒక రాజకీయ అంశంగా మార్చివేశాయి. ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందనే సంకేతాలు ప్రజలలోకి, రైతులలోకి పంపే విధంగా ప్రకటనలు, విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ స్థాయిలో రెండు లక్షల రూపాయల రైతు రుణాలు మాఫీ కాలేదు. గతంలో రెండు లక్షల రూపాయల రైతు రుణాల మాఫీ సాధ్యం కాదని మాట్లాడిన వారు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావు అయితే రుణమాఫీపై ఏకంగా ప్రభుత్వంపై రాజీనామా ఛాలెంజ్ కి దిగటం రైతాంగానికి మేలు చేయదు. రుణమాఫీ విషయంలో రాజకీయాలకంటే రైతుల ప్రయోజనాలు ముఖ్యమనే అంశాన్ని ప్రభుత్వం, విపక్షాలు గుర్తుంచుకోవాలి. రుణమాఫీ లాంటి ఒక కీలక అంశాన్ని రాజకీయాలకు వాడుకోకుండా అందరూ ప్రభుత్వానికి సహకరించి అడ్డంకులు రాకుండా తమ వంతు కృషి చేయాల్సిన సందర్భంలో అపోహలు, అపనమ్మకాలను సృష్టించటం మంచిది కాదు. ఆ విధమైన వ్యవహారం రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలి.
Also Read: అదానీ బొగ్గు దందాపై సర్కారు మౌనం..!
ఒకేసారి 40 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవటం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో రైతులకు లక్ష రూపాయల రుణాలు మాఫీ చేసింది. మొదటిసారి 16,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రెండోసారి దరిదాపుగా 19వేల పైచిలుకు రుణాలు వివిధ వాయిదాలలో మాఫీ చేయటం వలన రైతులకు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా 40 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేయాలనే ప్రయత్నం చేయటం ఒక విధంగా సాహసమనే చెప్పాలి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాలను గతంలో ఎప్పుడూ మాఫీ చేయలేదు. రైతుల రుణ విముక్తి కోసం ప్రభుత్వం రుణాలను మాఫీ చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందించదగినవే. రుణమాఫీ కోసం రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు, దానికి ఆదాయం మార్గాలను చూపించి రిజర్వ్ బ్యాంకు నుండి మరియు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతులు సాధించటానికి కొంత సమయం పట్టవచ్చు. అంత మాత్రం చేత ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ప్రయత్నాలకు మద్దతు తెలిపి రైతుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు రైతులకు మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత తొందరగా రెండు లక్షల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలని ఆశిద్దాం.
-డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం