no permission election commission conducting Telangana cabinet meeting:
తెలంగాణలో నేడు జరగవలసిన మంత్రి వర్గ సమావేశంపై సంధిగ్దం నెలకొంది. నిధుల సేకరణ, రుణమాఫీ తదితర అంశాలపై చర్చించేందుకు నేడు కీలక మీటింగ్ నిర్వహించాలని అనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. జూన్ 6 దాకా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. క్యాబినెట్ మీటింగ్ కు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే సీఎస్ శాంతికుమారి ఎన్నికల అధికారిని కోరారు.
ఇందుకు సంబంధించి ఈసీ అనుమతులు కూడా ఏమీ రాలేదు. దీంతో కేబినెట్ మీటింగ్ఉంటుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ శనివారం ఉదయం ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియేట్లో కేబినెట్ మీటింగ్ జరుగనున్నది.
ఎజెండాలో పలు అంశాలు
ఒకవేళ శనివారం కేబినెట్ మీటింగ్ జరిగితే.. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ, అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. రుణమాఫీకి అవసరమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూనిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు.
ధాన్యం కొనుగోళ్లు..
విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై కేబినెట్ మీటింగ్లో డిస్కస్ చేయనున్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై డిస్కస్ చేయనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్ లో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.