PM Modi: 2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ గెలిచింది. 2019లో అంతకంటే ఘన విజయాన్ని మోడీ సారథ్యంలోనే బీజేపీ అందుకుంది. ఆ రెండు సార్లూ దేశమంతా మోడీ హవా నడుస్తున్నదని చెప్పేవారు. బీజేపీ ఇప్పటికీ మోడీ వేవ్ ఉన్నదని నమ్ముతుంది. మోడీ ఛరిష్మా ఎన్నికల్లో బీజేపీ విజయానికి దోహదపడుతుందని చెబుతారు. బీజేపీ అభ్యర్థులు కూడా తప్పకుండా మోడీ పేరును ఉపయోగించి ప్రచారం చేస్తారు. మళ్లీ మోడీ ప్రధాని కావాలని పేర్కొంటూ తనను బీజేపీ ఎంపీగా గెలిపించాలని ఓట్లు అడుగుతుంటారు. కానీ, ఆ బీజేపీ మహిళా నాయకురాలు మాత్రం కమలం పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని తేల్చి చెప్పారు.
మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నవనీత్ కౌర్ రాణా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ఈ విధంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని, కాబట్టి, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు శాయశక్తుల పని చేయాలని సూచించారు. 2019లో మోడీ వేవ్ ఉండిందని, కానీ, నేడు మోడీ హవా లేదని స్పష్టం చేశారు.
Also Read: బీజేపీకి అంత సీన్ లేదు
ఆమె స్వయంగా బీజేపీ నాయకురాలు. అమరావతి నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి. సొంత నాయకురాలే బీజేపీపై ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, నాయకులు ఆమె వ్యాఖ్యలపై కామెంట్లు చేశారు.
2019లో నరేంద్ర మోడీ వేవ్ ఉన్నప్పుడు వాస్తవానికి ఆమె బీజేపీలో లేరు. నరేంద్ర మోడీ హవా ఉన్నప్పటికీ ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా గెలిచారు. అప్పుడు ఆమె అభ్యర్థిత్వానికి ఎన్సీపీ మద్దతు ఇచ్చింది. కానీ, ఎంపీగా గెలిచిన తర్వాత నవనీత్ కౌర్ రాణా బీజేపీ తీర్థం పుచ్చుకుంది. ఎన్నికల ముంగిట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు అన్ని పార్టీలను ఆకర్షించింది. దీంతో ఆమె మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించింది. తన ఉద్దేశాన్ని తప్పుగా చిత్రించారని, తాము మోడీ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లుతామని నవనీత్ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.