– కాంగ్రెస్ మేనిఫెస్టోపై తప్పుడు ప్రచారం తగదు
– మోడీ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు
– కాంగ్రెస్‌పై కావాలని విషం చిమ్ముతున్నారు
– ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఆయన పోటీకి అనర్హుడు
– అసదుద్దీన్ కూడా అంతే!
– టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ విమర్శలు
Niranjan Criticizes That They Are All Unworthy: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. నేతలు ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్. దేశ చరిత్రలో ఇంతగా దిగజారిన ప్రధానిని చూడలేదని చెప్పారు. మొదటి దశ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా లేవని భావించి, కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి నోటికొచ్చింది మాట్లాడుతున్నారని, దేశ సంపదను, మహిళల బంగారంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మోడీపై ఫైరయ్యారు.
‘‘రాజ్యాంగ పీఠికలో అన్ని వర్గాలకు, మతాలకు సమాన అవకాశాలు ఉంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేసే క్రమంలో రిటర్నింగ్ అధికారి ప్రమాణ పత్రం చదివిస్తారు. ప్రధాని, మంత్రుల ప్రమాణ స్వీకారాలలో కూడా ఇది ఉంటుంది. మోడీ ప్రసంగంతో ప్రధానిగా ఉండే నైతిక అర్హత కోల్పోయారు. దేశ ప్రజానికానికి క్షమాపణలు చెప్పిన తర్వాతే వారణాసిలో నామినేషన్ వేయాలి. ప్రధాని బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే, ఎన్నికల్లో పోటీకి ఎలక్షన్ కమిషన్ అనర్హుడిగా ప్రకటించాలి’’ అని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి మోడీ అనర్హుడని అన్నారు. ఈసీకి దీనిపై లేఖ రాస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ను రెండు సార్లు మోడీ ఉల్లంఘించారని, హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ బీఫ్ షాప్ వద్ద ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ప్రసంగించారని చెప్పారు. అందుకే, వీళ్లిద్దరినీ అనర్హులుగా ప్రకటించాలని కోరారు నిరంజన్.