- 10 వర్సిటీలకు కొత్త వీసీలు
- ఈసీ అనుమతితో నియమించేందుకు సర్కారు కసరత్తు
- ఇప్పటికే సెర్చ్ కమిటీ మందుకు చేరిన ప్రాథమిక జాబితా
- పెండింగ్‌లో మహిళా వర్సిటీ, బాసర ట్రిపుల్ ఐటీ
New VCs for Telangana Universities : తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్ ఛాన్సలర్లు రానున్నారు. 2024 మే 24తో ప్రస్తుత యూనివర్శిటీ వీసీల పదవీ కాలం ముగియనుంది. కానీ, ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి వీసీల నియామకాల ప్రక్రియ కాస్త ఆలస్యమవుతుందని అందరూ భావించారు. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని వీసీల నియామక ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది.
తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీల నియామకం కోసం వాస్తవానికి ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకటించటం, అందుకు గానూ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలు పూర్తయ్యాయి. మొత్తం 10 యూనివర్శిటీలకు కలిపి ఇప్పటివరకు మొత్తం 1500 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఇప్పటికే ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితాను సెర్చ్ కమిటీ పరిశీలించి అర్హుల పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కోడ్ కారణంగా వీసీల నియామక ప్రక్రియ బాగా ఆలస్యమైతే కొత్త వీసీల నియామకం జరిగే వరకు తాత్కాలికంగా ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించే అవకాశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే కొత్త వీసీల నియమాకం పూర్తయ్యే వరకు తమనే కొనసాగించాలని ప్రస్తుతం ఉన్న వైస్‌ఛాన్సలర్లు కోరుతున్నారు. ఒకవేళ అదే జరిగితే జూన్ లేదా జూలై మొదటి వారం వరకు పాత వీసీలే ఆయా బాధ్యతల్లో కొనసాగే అవకాశం ఉంది.
Read More: రైతన్న ఆక్రందన, లంచాల పేరుతో దగా..!
కొత్త వీసీల నియమించాల్సిన వర్సిటీల జాబితాలో తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూహెచ్), కాకతీయ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ(నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్నగర్)లతో జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ ఏయూ, హైదరాబాద్)లు ఉన్నాయి.
విద్యాశాఖ పరిధిలో మొత్తం తెలంగానలో మొత్తం 12 యూనివర్సిటీలు ఉండగా, వీటిలో ఆర్జీయూకేటీ(బాసర ట్రిపుల్ ఐటీ), తెలంగాణ మహిళా యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. అయినా విద్యాశాఖ ఇచ్చిన వీసీల నియమాక నోటిఫికేషన్‌లో ఆ రెండింటి పేర్లు పేర్కొనలేదు. వర్సిటీలతో పోలిస్తే ఆర్జీయూకేటీ చట్టం భిన్నంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కాంగ్రెస్ సర్కారు.. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే న్యాయపరమైన సలహా తీసుకుంటోంది. అలాగే గత ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ మహిళావర్సిటీకి నేటికీ ఎలాంటి స్పష్టమైన చట్టం చేయకపోవటంతో చట్టం చేసిన తర్వాతే దానికి వీసీని నియమించే అవకాశం ఉంది.