Wednesday, May 22, 2024

Exclusive

Employment: ఉత్తమాటలే తప్ప.. ఉద్యోగాలేవీ?

New Jobs: దేశంలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం సాగుతోంది. మరో నాలుగు రోజుల్లో మూడవ దశ ఎన్నికలు పూర్తవుతున్నాయి. సాధారణంగా లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన పాలనా కాలంలో సాధించిన విజయాలను, మళ్లీ గెలిపిస్తే తాను చేయబోయే హామీల చుట్టూ ప్రచారం జరిగేలా చూసుకుంటుంది. కానీ, బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన ప్రచార పంథాను ఎంచుకుంది. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌, దానితో చేయి కలిపిన పార్టీలమీద విమర్శల దాడి చేస్తూ, తీవ్రమైన భావోద్వేగాలను రేకెత్తించటం మీదనే బీజేపీ ప్రచారం సాగుతోంది. దీంతో దశాబ్దకాలంగా నిర్లక్ష్యానికి గురైన రంగాల మీద చర్చ జరగకుండా పోతోంది. ఈ పదేళ్ల బీజేపీ పాలనాకాలంలో దేశం ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో పదేపదే చెప్పి, యువతను ఆకట్టుకున్నారు. కానీ, పదేళ్ల పాలనలో ఆయన చేసిందేమీ లేకపోగా, తమ పాలనలో పాతిక కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చామని, అందువల్లనే మనదేశం ప్రపంచపు అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా మారిందని చెబుతున్న మోదీ సర్కారు.. ఈ పదేళ్లలో జీవికను కోల్పోయిన వారి లెక్కల గురించి మాత్రం నోరెత్తటం లేదు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం మనదేశంలో ఇంటర్ వరకు చదివి, ఆ తర్వాత చదివే స్థోమత లేక, ఏ ఉపాధి లభించని వారి సంఖ్య 13.2 శాతంగా ఉంది. విప్రో వ్యవస్థాపకుడైన అజీమ్ ప్రేమ్‌జీ పేరిట ఏర్పడిన యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో 25 ఏళ్ల వయసున్న డిగ్రీ పూర్తిచేసిన వారిలో 42.3% నిరుద్యోగులుగా మారారని లెక్కతేల్చింది. మరోవైపు ఉన్నత విద్య పూర్తిచేసిన వారిలో 21.4% మందికి తగిన ఉపాధి లభించలేదని కూడా ఈ సర్వే వెల్లడించింది. 2014 మే నెల నుంచి 2023 సంవత్సరాంతానికి దేశంలో నిరుద్యోగ రేటు 10.05% మేర పెరిగిందని, రెండున్నర కోట్లమంది తమ కొలువులు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ సర్వే గణాంకాల ప్రకారం, 2012 లో 2.1% గా ఉన్న నిరుద్యోగ రేటు,  2018 నాటికి 6.1% అయింది. 2014లో దేశ జనాభాలో 22.4% మంది నిరుద్యోగులుగా ఉండగా, గత 9 సంవత్సరాల సగటు 24.74% కి పెరిగింది. దేశంలో వలస కాలం నాటి కార్మిక చట్టాలను ప్రక్షాళన చేస్తామని 2015 నాటి 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌‌లో ప్రధాని ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. కనీసం 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీ 2018లో మోదీ సర్కారుకు అందించిన నివేదికలోని అంశాలనూ కేంద్రం పట్టించుకోలేదు. ప్రధానమంత్రి ఎంతో ఆడంబరంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి కౌశల్ యోజన.. దేశంలోని నిరుద్యోగుల కౌశల్యాన్ని మెరుగుపరచి ఉద్యోగాలు కల్పించే పథకంగా మారలేకపోయింది.

Also Read: భారత మేడే వేడుకకు ఆద్యుడు.. సింగారవేలు

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఈ పదేళ్ల కాలంలో బాగా తగ్గిపోయింది. నేటి ప్రభుత్వాలన్నీ ఔట్ సోర్సింగ్, టెంపరరీ ఉద్యోగులతో పని జరిగిపోతే చాలని నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా సాపేక్షంగా  ప్రైవేటీకరించబడుతోంది. ముంబై ఐఐటి, మద్రాస్ ఐఐటిలలోనూ గ్రాడ్యుయేట్లలో 28 శాతం మందికి క్యాంపస్ ఇంటర్‌వ్యూలు లేకపోవటంతో, దేశంలోని నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అర్హతకు తగిన ఉద్యోగాలు రాకపోవటంతో నిరుద్యోగులు దొరికిన పని చేసుకుంటూ, అంసంఘటిత కార్మకులుగా మిగిలిపోతున్నారు. ఏడేళ్ల నాడు మన శ్రామిక శక్తిలో 32% మంది 45 ఏళ్లు పైబడివారు ఉండగా, నేడు 50% మంది 47 ఏళ్లు దాటినవారే. అంటే మరో 13 ఏళ్లలో దేశంలోని నిరుద్యోగుల్లో సగం మంది వయసు 60 ఏళ్లు దాటనుంది. దీంతో ఈ అసంఘటిత రంగంలోని విద్యాధికులంతా ఏ సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు లేని వారిగా మారనున్నారు.

మనదేశంలో అత్యధికమందికి ఉపాధిని అందించే వ్యవసాయ రంగమూ ఈ పదేళ్ల కాలంలో కునారిల్లిపోయింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ రైతు చట్టాల పేరుతో హడావుడి చేశారే తప్ప మద్దతు ధరకు చట్టబద్దత కల్పించలేకపోయారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రూ. 6 వేలు అందించి, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల మీద సబ్సిడీలు ఎత్తిపారేశారు. ఈ పదేళ్ల కాలంలో లక్షన్నర మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ప్రభుత్వ బ్యాంకుల రుణాలు అందక చిన్న, సన్నకారు, అటవీ భూములు, కౌలు భూములు సాగుచేసుకునే రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కోరల్లో ఇరుక్కుపోయారు. 2012 -13లో రైతు కుటుంబాల సగటు అప్పు రూ. 47వేలు. కాగా నేడు అది రూ. 90 వేలకు చేరింది. దేశంలోని మొత్తం కార్మికుల్లో 47% మందికి ఉపాధికల్పించే రంగానికి బడ్జెట్‌లో కేవలం 5% మూలధనం మాత్రమే అందుతోంది. మరోవైపు వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగటంతో రైతు కూలీలకు పని లేకుండా పోతోంది. దీంతో ఈ కూలీలంతా వేరే రంగాల్లో ఉపాధికోసం వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. యూపీఏ హయాంలో మన ఆర్థిక వ్యవస్థ ఏటా 74 లక్షల వ్యవసాయేతర రంగాల ఉద్యోగాలను కల్పించింది. దీంతో 2014 నుంచి ఏటా 50 లక్షల మంది సాగురంగాన్ని వదిలి, ప్రత్యామ్యాయ రంగాలకు మరలుతారని భావించారు. కానీ, కొవిడ్ సంక్షోభం కారణంగా పట్టణ, నగర ప్రాంతాల ఉద్యోగులు స్వగ్రామాలకు చేరటంతో 2020లోనే 3.5 కోట్ల మంది పొలంబాట పట్టారు. రెండో వేవ్ నాటికి మరో కోటి మంది సాగురంగంలోకి అడుగుపెట్టటంతో ప్రస్తుతం ఈ రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

Also Read: వికసిత భారతం ఎవరికి?

దేశంలోని కార్మికుల రక్షణనూ మోదీ ప్రభుత్వం గాలికొదిలేసింది. 2014 నాటికి దేశంలో ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా చేయాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. 2015 జులైలో కార్మిక చట్టాల సవరణకు పూనుకోగా, దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పటికి వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం 2022లో 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చి 2023లో పార్లమెంట్ ఆమోదం పొందింది. పనిగంటలు, ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, సమ్మెనోటీసు కాలపరిమితి, లేఆఫ్‌ నియమాల విషయంలో కార్మికులకు అన్యాయం చేసి వారి భవిష్యత్తును మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు తాకట్టు పెట్టింది. అసలే ఉద్యోగాలు తగ్గిపోతుంటే.. ఈ చట్టాలు ఉద్యోగులకు ఎలాంటి భద్రతా లేకుండా చేస్తున్నాయి. చివరగా.. ప్రధాని ఏకరువు పెడుతున్న ప్రభుత్వ గణాంకాలకు, ఆయన ప్రజలకు ఇస్తున్న హామీలకు పొత్తుకుదరటం లేదు. మనదేశం ప్రపంచపు అతిపెద్ద 5వ ఆర్ధిక వ్యవస్థగా మారిందని, ఏటా 8% సగటు వృద్ధి రేటు నమోదు చేస్తోందని ఆయన చెబుతున్నారు. అదే సమయంలో దేశ ప్రజలకు మరికొన్నేళ్ల పాటు ఉచిత రేషన్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీనిని బట్టి దేశంలో దారిద్ర్యం పెరిగిపోయిందని ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నట్లేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నిరుద్యోగం పెరగటం, దానికి ద్రవ్యోల్బణపు సెగ తగలటంతో ప్రజల కొనుగోలు శక్తి వేగంగా తగ్గిపోతోందనీ, అందుకే దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఉత్పాదక రంగంలో మరిన్ని పెట్టుబడులకు సాహసం చేయడం లేదనీ, అందుకే కొత్త ఉద్యోగాల కల్పన జరగటం లేదని కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యువత నైపుణ్యాలను పెంచి వారిని డైరీ డెవలప్‌మెంట్, సేంద్రియ వ్యవసాయం, ఉద్యానవన పంటలు, మాంసం ఉత్పత్తి వంటి వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మళ్లిస్తే వారి ఆదాయాలు పెరగటమే గాక కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. కేంద్రంలోని పాలకులకు ఈ గణాంకాల పట్ల కనీస అవగాహన గానీ, ఆయా రంగాల మీద శ్రద్ధ పెట్టాలనే సంకల్పం లేకపోబట్టే.. ఈ ఎన్నికల్లో ఈ అంశాల్లో ఒక్కటీ చర్చకు రావటం లేదని అర్థమవుతోంది. మూడోసారి కూడా ఇలాంటి బాధ్యత లేని పాలకులు అధికారంలోకి వస్తే.. దేశంలోని యువతకు ఎలాంటి భవిత లేనట్లే.

                                                                      సదాశివరావు ఇక్కుర్తి
                                                                       సీనియర్ జర్నలిస్ట్

Publisher : Swetcha Daily

Latest

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Don't miss

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Democracy: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫిరాయింపు రాజకీయాలు సమంజసమేనా?

Is The Politics Of Defection Justified In A Democratic System: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం కాకుండా పవర్ కోసమే పథకాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ఐదేళ్ల కాంట్రాక్ట్...

Primary Education: ప్రాథమిక విద్యను ఇకనైనా పట్టించుకోరూ..!

Never mind primary education in Telangana: వేసవి సెలవుల అనంతరం తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ జూన్ 12వ తేదీన తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో రాబోయే విద్యా సంవత్సరం కోసం...

Politics: చిన్న లేఖ, పెద్ద సందేశం

Short Letter, Big Message: దేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు.. తమ విధివిధానాలను ప్రజల ముందుంచి, వారి సమ్మతిని ఓటు రూపంలో పొందటం తెలిసిందే. అలా...