- జాతీయస్థాయిలో మార్మోగుతున్న రేవంత్ రెడ్డి పేరు
- కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ గా అవకాశం
- ప్రతి రాష్ట్రంలోనూ మోదీపై ధీటైన విమర్శలు
- రిజర్వేషన్ల అంశంతో ఒక్కసారిగా మారిపోయిన సీన్
- రేవంత్ దెబ్బకు జాతీయ స్థాయిలో బీజేపీపై వ్యతిరేకత
- మోదీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే అంశాన్ని బలంగా తీసుకెళ్లిన రేవంత్
- అమిత్ షా ఫేక్ వీడియోతో బెదిరింపు చర్యలు
- ఢిల్లీ పోలీసులను లెక్క చేయని రేవంత్ రెడ్డి
Reventh Reddy recognised in future as National leader :
ప్రతి ఎన్నికలలో మోదీ హవాను ఎదుర్కోలేక ఢీలా పడిపోతున్న జాతీయ కాంగ్రెస్ కు ప్రస్తుతం ఆ పార్టీలో జాతీయ స్థాయిలో ఎదిగిన నేతలు కరువయ్యారు. ఇప్పటిదాకా తనకు ఎదురే లేదని భావించిన మోదీ రాహుల్ గాంధీని సైతం తన రాజకీయ చతురతతో ఇరుకున పెడుతున్నారు. అయితే ప్రాంతీయ పార్టీ నుంచి నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే తెలంగాణలో పార్టీకి కొత్త ఊపిరి ఊదారు. అన్నింటికన్నా ముఖ్యంగా అధిష్టానం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ నిచ్చింది. అవకాశాన్ని నిచ్చెనగా వాడుకుని..పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ అప్రతిహతంగా దూసుకెళుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సీటు చేజిక్కించుకున్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే తనదైన మార్కును చూపుతూ వెళుతున్న రేవంత్ సామర్థ్యాన్ని అధిష్టానం గుర్తించింది. జాతీయ స్థాయి క్యాంపెయినర్స్ లిస్టులో రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. రేవంత్ రెడ్డి తనకి లభించిన ఈ అవకాశాన్ని కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. వెళ్లిన ప్రతి చోటా మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
పెద్దన్నకు ధీటైన సమాధానం
ఇక తెలంగాణ విషయానికి వస్తే..మోదీని పెద్దన్న అంటూనే సమయం వచ్చినప్పుడు తన ధీటైన విమర్శలతో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్యతను క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేయనుందా..? అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు ప్రారంభమైన కొద్ది కాలం కిందటి వరకు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద బలమైన ఆయుధం లేకపోయిందన్నది విశ్లేషకుల మాట. ప్రజాస్వామ్య పరిరక్షణ – భారత్ జోడో అనే నినాదంతో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినా అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు.
బీజేపీని ఇరుకున పెట్టేందుకే..
బీజేపీ మాత్రం పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించకపోగా..మతం పేరిట రాజకీయాలు చేసేలా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. మైనార్టీ పేరిట మెజార్టీల మనోభావాలను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేలా వ్యూహం ప్రకారం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే బీజేపీకి ముకుతాడు వేసేలా రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టాలంటే రిజర్వేషన్ల రద్దు అంశమే ప్రధాన ఎజెండా అవుతుందని.. ఇందుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఎజెండా కూడా రిజర్వేషన్ల రద్దు అంటూ ఆధారాలతో సహా నిత్యం జనాల్లో చర్చకు పెడుతున్నారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దును బలపర్చడమే అవుతుందంటూ ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్ షాలను టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు చేస్తుండటంతో రేవంత్ వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో కూడా స్పేస్ దక్కుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు రేవంత్ ఓ అస్త్రాన్ని ఇచ్చారని.. ఇది కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మేలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యాంగంపై కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడినా రిజర్వేషన్ల రద్దు అంటూ రేవంత్ లేవనెత్తిన ఈ అంశం చుట్టే జాతీయ రాజకీయాలు తిరుగుతుండటం విశేషం. అందుకే రేవంత్ ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక అమిత్ షా ఫేక్ వీడియో తెచ్చి ఎన్నికల ముందు రేవంత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు బీజేపీ నేతలు అని విమర్శకులు చెబుతున్నారు.
జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్ట్
రేవంత్ కూడా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర ప్రస్తుతం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన మనుగడకు, గుర్తింపుకు ఇది మంచి పరిణామం కాదన్నారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని చెప్పారు. జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని చెబుతూ జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయి ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మన ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించాలన్నా మాట్లాడే నేతలు కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు.మనవాళ్లుగా మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. . గతంలో నంద్యాలలో పివి పోటీ చేసినపుడు, తెలుగువాడు ప్రధానిగా ఉండాలని ఎన్‌టిఆర్ పీవీపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారు అని అన్నారు. ముందు ముందు జాతీయ స్థాయి రాజకీయాలను శాసించే నేతగా రేవంత్ రెడ్డి ఎదగవచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు.