TS News: రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీ ముగియడంతో వీరిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరద్దరిని ఏప్రిల్ 6వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరినీ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. దర్యాప్తులో ప్రణీత్ రావు వెల్లడించిన వివరాలను ఆధారం చేసుకుని భుజంగరావు, తిరుపతన్నలను ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఏ4గా ఉన్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకు పని చేసినట్టు వెల్లడించారు. మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో కోట్ల రూపాయాలు సీజ్ చేశామని పోలీసులకు తెలిపారు. అంతేకాదు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు సరఫరా చేసినట్టూ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఈ టీమ్ పని చేసినట్టు ఆయన పోలీసులకు వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును ఉదహరిస్తూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా కేటీఆర్ కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కే మహేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలకు పరువు నష్టం కింద లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. తనకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవడానికైనా సిద్ధం కావాలని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
ఇంకా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావును విచారించాల్సి ఉన్నది. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావు విచారణలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది తేలుతుందని చూస్తున్నారు. దీంతో ప్రభాకర్ రావు విచారణలో పెద్ద తలకాయల పేర్లు బయటికి వస్తాయని భావిస్తున్నారు.