Nabha Natesh after some gap coming with Darling movie:
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ అందం, టాలెంట్ పుష్కలంగా ఉన్న నటి. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత వరుసగా మూవీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇస్మార్ట్ బ్యూటీ అనిపించుకుంటోంది. ఈ మూవీలో నభా గ్లామర్ హైలెట్ అయింది. అయితే నభా కెరీర్ అంత సాఫీగా జరగలేదు. రవితేజతో నటించిన డిస్కోరాజా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మళ్లీ నభా కెరీర్ డేంజర్ లో పడింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఈ చిన్నది.
అయితే నభా నటేష్ కు యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే ‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు సెట్లో నభా, ప్రియదర్శితో పాటు చిత్ర బృందం మొత్తం కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ‘‘కొత్తదనం నిండిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసి త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. నరేశ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.