Siddipet: కాంగ్రెస్ మెదక్ లోక్ సభ అభ్యర్థి నీలం మధు తరఫున సిద్దిపేటలో ప్రచారం చేస్తూ మంత్రి కొండా సురేఖ, మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై విమర్శలు సంధించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై మైనంపల్లి విరుకుపడ్డారు. కొండపాక మండలానికి మార్కెట్ కమిటీ ఎందుకు ఇవ్వలేదని హరీశ్ రావును ప్రశ్నించారు. మొన్న మీడియాలో హరీశ్ రావు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే కనిపిస్తలేడని అన్నాడని గుర్తు చేస్తూ.. హరీశ్ రావు అబద్ధాలు ఆడతాడని, కానీ, మైనంపల్లి అబద్ధాలు చెప్పే మనిషి కాదని స్పష్టం చేశారు. తాను మెదక్‌కు 100 సార్లకు తక్కువగా రాలేదని శివుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు. ఒక వేళ 100 సార్లకు తగ్గకుండా నేను మెదక్‌కు వచ్చినట్టయితే హరీశ్ రావు రాజీనామా చేస్తావా? అని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ నాయకులు దళితబంధు పేరిట దళితులను మోసం చేశారని, హరీశ్ రావు, ఆయన మామ దుకాణం బంద్ అవుతుందని మైనంపల్లి అన్నారు. చేరికలతో కాంగ్రెస్ పార్టీ ఓవర్‌లోడ్ అయిందని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో రోడ్ షో చేస్తారని వివరించారు. ఆదర్శవంతమైన సీఎంగా రాజశేఖర్ ఉంటే.. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో చెప్పాలంటే కేసీఆర్‌ను చూపించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రావడానికి ముందు దళిత సీఎంను చేస్తానని చెప్పి.. తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారని విమర్శించారు. కవిత లిక్కర్ పాలసీ ద్వారా గ్రామాల్లో మందు ఏరులైపారుతున్నదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, అవినీతితో కోట్లు సంపాదించిన ఘనత కేసీఆర్‌దేనని ఫైర్ అయ్యారు. పదేళ్లలో హరీశ్ రావు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తాము నాలుగు నెలల్లోనే ఐదు గ్యారంటీలు నెరవేర్చామని వివరించారు.
Also Read: మండల్ కమిషన్ తెస్తే.. కమండల్ యాత్ర చేసిందెవరు?
ఎలక్షన్ కోడ్ ఉండటం మూలంగా వడ్లకు బోనస్ ఇవ్వలేకపోయామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎలక్షన్స్ ముగిశాక వెంటనే వడ్లకు బోనస్ ఇస్తామని తెలిపారు. కేసీఆర్ తన నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయలేదని, ఇక రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. బిడ్డ కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి బీజేపీకి ఓటు వేయండని కేసీఆర్ చెప్పుతున్నాడని ఆరోపించారు. బీజేపీ ఓట్ల కోసం దేవుళ్లను ఉపయోగిస్తున్నదని, అయోధ్యలో సీతాదేవి లేకుండా బాల రాముడి విగ్రహం ఒక్కటే కట్టడం అరిష్టం అని అన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి మెదక్ ఎంపీ సీటును గిఫ్టుగా ఇద్దామని అన్నారు.