Tamilisai soundararajan: గవర్నర్.. ఒక రాజ్యాంగబద్ధ పదవి. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌ను అధిపతిగా భావిస్తారు. జాతీయ స్థాయిలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు.. రాష్ట్ర స్థాయిలో గవర్నర్ నిర్వర్తిస్తుంటారు. అంటే.. ఆ గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మర్యాదపూర్వక, సత్సంబంధాలు ఉండాలి. కానీ, గతేడాది వరకు తెలంగాణలో ఈ రెండు వ్యవస్థల మధ్య వైరాన్ని చూశాం. ఆ వైరం బయటికి కనిపించేదానికన్నా తీవ్రమైనదని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తు ద్వారా తెలుస్తున్నది. గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. గవర్నర్‌ను కూడా వదిలిపెట్టలేదనే కోణంలో కామెంట్ చేశాయి. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ వార్తలను ధ్రువీకరించారు.
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ కొత్త ట్విస్ట్‌లను ఇస్తున్నది. రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఫిలిం స్టార్లే కాదు.. తాజాగా ఫోన్ ట్యాపింగ్‌కు గవర్నర్ కూడా మినహాయింపేమీ కాదని బయటపడింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. 2022 నవంబర్‌లోనే తాను ఈ అనుమానాలను వ్యక్తం చేసినట్టు గుర్తు చేశారు. తాను గవర్నర్‌గా ఉన్నప్పుడ తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు అనుమానాలు వచ్చాయని, అందుకు బలమైన కారణాలూ ఉన్నాయని వివరించారు. ఈ విషయాన్నే తాను 2022 నవంబర్‌లో బహిరంగపరిచానని, కానీ, అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ తాను రాజకీయాలు చేస్తున్నట్టు ఆరోపించారని పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు తనకు బలమైన అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తాను అప్పుడు చెప్పిందే ఇప్పుడు నిజం అవుతున్నదని చెప్పారు.
Also Read: కేసీఆర్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్‌గా ఉన్న తమిళిసైతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప్పు నిప్పు అన్నట్టుగా వ్యవహరించింది. అవకాశం దొరికితే అప్పటి అధికార పార్టీ నాయకులు అప్పటి గవర్నర్ తమిళిసై పై విమర్శలు చేసేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య వైరం చివరి వరకూ కొనసాగింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కేటీఆర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ.. అవసరమైతే తాను లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా సిద్ధం అని ప్రకటించారు.