Papua New Guinea: ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో మహా విషాదం నెలకొంది. కొండ చరియలు విరిగిపడి వేల మంది మరణించారు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి పెళపెళ మంటూ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపాదాల వద్ద ఉన్న ఓ కుగ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇళ్లు, ఇళ్లల్లో నిద్రిస్తున్న గ్రామస్తులు సజీవంగా సమాధి అయ్యారు. పోర్గెరా మైన్‌కు వెళ్లే రహదారి అక్కడ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఈ ఘటన ఎన్‌గా ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య రెండు వేలను దాటింది.
ఈ ఘటనలో రెండు వేలకు పైగా ప్రజలు సజీవ సమాధి అయ్యారని ఆ దేశ విపత్తు కేంద్రం ఐరాసకు తెలిపింది. భవంతులు, ఫుడ్ గార్డెన్లు అన్నింటినీ నేల మట్టమయ్యాయని, దేశ ఆర్థిక జీవధార దెబ్బతిన్నదని వివరించింది. ఇప్పటికీ పరిస్థితులు అస్థిరంగానే ఉన్నాయని, ఇంకా కొండ చరియలు విరిగిపడుతూనే ఉన్నా యని పేర్కొంది. తద్వార విపత్తు నిర్వహణ బృందాలతోపాటు కొనఊపిరితో ఉన్న బాధితులకూ ముప్పు కొనసాగుతూనే ఉన్నదని వివరించింది. దేశంలోని అన్ని వ్యవస్థలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, పపువా న్యూగినియా మిత్రదేశాలకు ఈ పరిస్థితులను వివరించాలని కోరింది. పపువా న్యూగినియా డిజాస్టర్ సెంటర్ ద్వారా సహాయ సహాకారాలను సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. పపువా న్యూగినియాలో మరణాలపై దిగ్భ్రాంతి చెందినట్టు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశ ప్రభుత్వం, ప్రజలకు అండగా నిలబడుతామని వివరించారు.