– పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎదురీత
– దేశవ్యాప్తంగా జోరందుకున్న వ్యతిరేక పవనాలు
– రాజ్యాంగం రద్దు మాటలతో ఫుల్ డ్యామేజ్
– ఇప్పటికే దూరమైన ముస్లింల ఓటు బ్యాంక్
– రాజస్థాన్, యూపీలో రాజ్‌పుత్‌ల నుంచి వ్యతిరేకత
– జేడీఎస్ నేత ప్రజ్వల్ వ్యవహారంతో భారీ నష్టం
– ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలం
– ఎవరైనా గట్టిగా నిలదీస్తే కేసులు
– మోదీ సర్కార్‌కు టైమ్ దగ్గర పడిందంటున్న విపక్షాలు
Modi Third time power countrywide troubles : ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ మొదట్లో ప్రచారాన్ని హోరెత్తించిన కమలనాథుల ఉత్సాహం దశలవారీగా ఎన్నికలు జరిగే కొద్దీ నీరుగారిపోతోంది. రాబోయే ఎన్నికలలో మెజార్టీ సీట్లు కష్టమేననే సంకేతాలు ఎదురవుతున్నాయి. ఓవైపు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు తామే అంటూ మోదీ, అమిత్ షా రెచ్చిపోయి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. కానీ, విపక్షాల ఎదురుదాడులు, మిత్రపక్షాల అసంతృప్తి సెగలు బీజేపీ గెలుపునకు స్పీడ్ బ్రేకర్లవుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. రాజీనామాలు, ఎంపీల మరణాలు, ఉప ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలతో 14 స్థానాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్ సభలో 289 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాని మోదీ చెప్పిన దాని ప్రకారం సొంతంగా బీజేపీ 370 సీట్లు గెలుచుకోవాలంటే, 81 సీట్లు అదనంగా రావాలి. అందుకు బీజేపీకి రామమందిరం మినహా అనుకూల అంశాలేమీ కనిపించడం లేదనే టాక్ ఉంది. ఇదే సమయంలో బీజేపీకి ప్రతికూలంగా మారిన అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
వ్యతిరేక అంశాలెన్నో!
పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం, నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరగడం, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, గిట్టుబాటు ధరకు హామీ లేకపోవడం, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, రాష్ర్టాల మధ్య నీళ్ల పంచాయితీలు తీర్చకుండా చోద్యం చూడటం, బీజేపీ పాలిత రాష్ట్రాలపై ప్రేమ, విద్యుత్ సంస్కరణల పేరుతో ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టడం, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, సెస్సులు పిండుకోవడం, ఇలా అనేక వ్యతిరేక అంశాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు. దీనివల్ల బీజేపీతో స్నేహం అంటేనే పార్టీలు భయపడే పరిస్థితి దాపురించిందని, ఎన్డీఏలో చేరితే పార్టీ ఖతమైనట్టేనని అకాలీదళ్, శివసేన వంటివి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి చిన్నాచితకా పార్టీలతో కూటమి ఏర్పాటు చేసిన బీజేపీ, పేరుకు 23 పార్టీల కూటమి అయినా జేడీయూ, టీడీపీ, ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తప్ప మిగతా పార్టీలు కనీసం నాలుగైదు స్థానాల్లో కూడా పోటీ చేయలేని స్థాయిలో ఉన్నాయని అంటున్నారు.
రిజర్వేషన్ల రద్దు వివాదం
బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు.
అమిత్ షా అత్యుత్సాహం
అమిత్ షా ఎడిటెడ్ వీడియో బయటకొచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. దానికి కారణం గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలే కారణం. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం
కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు రావడం కలకలం రేపుతుండగా, బీజేపీ ఆశలకు బ్రేక్ పడినట్టయింది. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్‌ను జేడీఎస్ నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నాయి. వీటికితోడు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసును ఉదాహరణగా చూపుతున్నారు. రిజర్వేషన్లపై ఆయన ఆధారాలతో సహా నిలదీస్తుంటే, తట్టుకోలేక ఢిల్లీ పోలీసులను పంపారని హస్తం వర్గాలు మండిపడుతున్నాయి.