- ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డ టీ.కాంగ్రెస్
- సామాన్యుడిపై జీఎస్టీ బాదుడు ఏమిటంటూ నిలదీత
- పేదవాడి అకౌంట్ లో రూ.15 లక్షలు ఎప్పుడు
- పెట్రోల్, డీజిల్ ధరల సంగతి ఏమిటి?
- రైతులు, కార్మికులు, చిన్నతరహా పరిశ్రమలపై జీఎస్టీ ప్రభావం
- రొట్టే, పాలుపైనా జీఎస్టీ వసూళ్లా?
- టీ.కాంగ్రెస్ ప్రశ్నలతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి
Modi GST common people suffering T.Congress tweets:
పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీ-కాంగ్రెస్ బీజేపీపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. సామాన్యూడిపై జీఎస్టీ బాదుడు ఏంటని మండిపడింది. ప్రతీ పేదవాడి అకౌంట్ లో రూ.15లక్షల జమ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. గత పదేళ్లుగా 80 కోట్ల మంది ఎదురుచూస్తున్నారని తెలిపింది. రూ.15 లక్షలు ఇవ్వకపోగా మినిమం బ్యాలెన్స్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయల వసూళ్లు చేశారని తెలిపింది. నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ భారం, పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్, వంట నూనె, కందిపప్పు ధరల పెంచారని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) పేద ప్రజలు, రైతులు, కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలపై భారం చూపిందని పేర్కొంది. పేద ప్రజలు తినే రొట్టెపై, చివరకు పసిపిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ వసూల్ చేస్తున్నారని మండిపడింది.
పేద, ధనిక తారతమ్యాలు
పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం పన్నుల విధానానికి రూపకల్పన చేయాలి. పేదలపై పన్నుల భారం వీలైనంత తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ, పదేండ్ల మోదీ ప్రభుత్వ హయాంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని పన్నుభారం పడుతోంది. మరోవైపు కార్పొరేట్లకు పన్నుల భారం తగ్గుతోంది. ఆదాయానికి తగ్గట్టుగా చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను కేంద్రం తగ్గిస్తోంది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరిపైనా భారం మోపే పరోక్ష పన్నులను పెంచుతోంది. ఫలితంగా పదేండ్ల మోదీ పాలనలో పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. ధనికులు మరింత ధనవంతులు అవుతున్నారు.మోదీ హయాంలో ప్రత్యక్ష పన్నులు తగ్గుతూ ఉంటే పరోక్ష పన్నులు పెరుగుతున్నాయి. అంటే, ఆదాయంతో సంబంధం లేకుండా అందరూ చెల్లించాల్సిన పన్నులు పెరుగుతున్నాయి. పేదలు, మధ్యతరగతిపై ఈ భారం పడుతోంది. 2013 – 14లో పన్నుల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయంలో ప్రత్యక్ష పన్నుల వాటా 39.4 శాతంగా ఉంటే 2021 – 22 నాటికి 34.2 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పరోక్ష పన్నుల వాటా 2013 –14లో 60.6 శాతం ఉంటే, 2021 –22 నాటికి 65.8 శాతానికి పెరిగింది.