- పైకి వికసిత్ కబుర్లు
- లోన విభజిత్ రాజకీయాలు
- దక్షిణాదిపై అడుగడుగునా వివక్ష
- కీలక మంత్రిత్వ శాఖలన్నీ ఉత్తరాది వారికే
- బడ్జెట్ కేటాయింపుల విషయంలోనూ వివక్షే
- బీజేపీ పాలిత రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యం
- దక్షిణాది రాష్ట్రాలు ఓట్లకే పరిమితమా?
- పార్లమెంట్ ఎన్నికల వేళ పదేళ్ల మోదీ పాలనపై చర్చ
Modi divide politics between North and South india lok sabha:
ప్రధాని మోదీ నిత్యం వల్లె వేసే వికసిత్ భారత్, విభజిత్ భారత్‌గా మారిందనే విమర్శలున్నాయి. గత పదేళ్లలో ఉత్తరాది రాష్ట్రాలను ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాలను మరోలా ట్రీట్ చేయడమే అందుకు కారణం. బడ్జెట్ పరంగా చూసినా, భారీ ప్రాజెక్టుల కేటాయింపులు చూసినా, కేంద్ర కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలు చూసినా అడుగడుగునా ఉత్తరాది ముద్రే కనిపిస్తుంది. కానీ, ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి కేవలం ఓట్ల కోసం మాత్రమే దక్షిణాది గుర్తుకొస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశం కోరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చి పదేళ్లు అయింది. ఇప్పుడు మరోసారి గెలవాలని ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలపై చూపిన వివక్షను విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. గత కొన్ని ఏండ్లుగా రోడ్లు, వంతెనలు, రైల్వేలు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి, నగరాభివృద్ధి, మెట్రో రైళ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ కేటాయింపుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు మాత్రమే ఎక్కువగా మొగ్గు చూపింది. ముంబై-బరోడా మధ్య బుల్లెట్ రైలు ఖరీదు 5 లక్షల కోట్ల రూపాయలు. ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు కావడంతో తన సొంత రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఎంపిక చేశారని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. గుజరాత్‌కు ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా అసమానమైన రీతిలో నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త ఆసుపత్రులు, ఇన్‌స్టిట్యూట్‌లు, ఇతర సంస్థలు అధికార బీజేపీ పాలిత అనుకూల రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.
131 సీట్లపై కన్నేసిన బీజేపీ
దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 20 లోక్ సభ సీట్లు, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, కర్నాటకలో 28, పుదుచ్ఛేరిలో ఒక సీటు ఉన్నాయి. ఈ 131 సీట్లలో కనీసం సగానికిపైగా సీట్లను గెలిస్తే గానీ, బీజేపీ అనుకున్న 400కి మించిన టార్గెట్ నెరవేరదు. పైగా, ఉత్తరాదిలో ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో మరోసారి గట్టెక్కాలంటే దక్షిణాది ఇప్పుడు బీజేపీకి ముఖ్యమైంది. గత పార్లమెంటు ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నుంచి ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు. కర్నాటకలో 25, తెలంగాణలో 4 స్థానాలు గెలిచింది. ఏపీలో ఒక్క సీటూ గెలవకపోయినా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ దాదాపు ఎన్డీఏ పక్షంగానే వ్యవహరించాయి. కర్నాటక, తెలంగాణ, కేరళ మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్న బీజేపీకి ఏపీలో ఏ పార్టీ గెలిచినా ఆ 25 సీట్లు వాళ్ల ఖాతాలోనే పడతాయి. కేరళలో కాంగ్రెస్ హవా కొనసాగితే సీట్లు తగ్గుతాయి. తెలంగాణలో ఈసారి పూర్తి స్థాయిలో కేంద్రీకరించినందున ఒకటో రెండో సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. కేరళ, తమిళనాడు, ఏపీలో ఖాతా తెరిస్తే బీజేపీ ప్రయత్నం సక్సెస్ అయినట్టే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
కీలక శాఖలన్నీ వారివే
కేంద్ర కేబినెట్‌లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది. కీలకమైన శాఖలు కూడా ఆ రాష్ట్రాలకు చెందిన మంత్రుల వద్దనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 172 మంది ఎంపీలు ఉన్నారు. అంటే, దాదాపు 33 శాతం అన్నమాట. అయితే, ఈ రాష్ట్రాలకు చెందిన మంత్రుల్లో ఒక్క కీలక శాఖకు చెందిన మంత్రి కూడా లేరు. రాజకీయ సంఖ్యా బలం ఉన్న స్థాయిలో కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అసమానత కొనసాగుతున్నదనే విమర్శలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటక, కేరళ, బెంగాల్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ బలం చాలా తక్కువగా ఉండడం అసమానతకు అద్దం పడుతోందని అంటున్నారు.
ప్రాంతీయ పార్టీలలో పట్టున్న కాంగ్రెస్
అయితే ముందు నుంచి ధీమాగా చెబుతున్న 400 టార్గెట్ కు చేరుకోవాలంటే బీజేపీకి కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దక్షిణాది ఓటర్లు మోదీ పాలనపై గుర్రుగా ఉన్నారు. పైగా ఉత్తరాదిలో మత రాజకీయాలు పనిచేసినట్లుగా దక్ణిణాదిలో పనిచేయవు. ఇక్కడ కులాల రాజకీయాలే నేతలను శాసిస్తుంటాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ గమనించి మోదీ ముస్లిం రిజర్వేషన్ల అంశం లేవనెత్తారు. ప్రాంతీయత, కుల, మత రాజకీయాల వారీగా దేశాన్ని ఓట్ల కోసం విడదీసస్తున్న బీజేపీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వికసిత్ భారత్ కాదు విభజిత్ భారత్ రాజకీయాలను మానుకోవాలని విపక్షాలు బీజేపీని హెచ్చరిస్తున్నాయి.