- చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం
- ఒక్కో దశలో ఒక్కోప్రచార దిశ మార్చిన మోదీ
- మొదట్లో వికసిత్ భారత్ అంటూ ప్రచారం
- చివరికి వచ్చేసరికి విద్వేషాలు రగిల్చే ప్రసంగాలు
- ముస్లింల కోసం ముజ్రా డ్యాన్స్ అంటూ చవకబారు వ్యాఖ్యలు
- సంక్షేమ పథకాల ప్రచారం పక్కన పెట్టేసిన ప్రధాని
- అడుగడుగునా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలే
- ప్రధాని స్థాయి మాటలు కావవి అంటూ..
- మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు
Modi chief coments on opposition parties and muslims against statements:
లోక్ సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఏడవ దశ లోక్ సభ ఎన్నికలలో మొత్తం 8 రాష్ట్రాలలో 57 స్థానాలకు గానూ జూన్ 1న పోలింగ్ జరగనుంది. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేయనున్న వారణాసి నియోజకవర్గం కూడా ఏడవ దశలోనే ఉండటంతో సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఆఖరి సమరం ఇదే. ఈ ఏడు దశలలోనూ ప్రధాని మోదీ ప్రచార సరళి గమనిస్తే గత ఎన్నికలలో కనిపించిన ఆత్మవిశ్వాసం తగ్గినట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల దాకా ఎందుకు మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటినుంచి దాదాపు మూడు వారాల పాటు ప్రధాని మోదీ తన ప్రచారంలో ఎక్కువగా వికాస్, విశ్వగురు, సనాతన్, వికసిత్ భారత్ లాంటి నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక విమర్శించాల్సి వస్తే కాంగ్రెస్ కుటుంబ పాలనపై ధ్వజమెత్తేవారు. అయితే ప్రతిపక్షాల కూటమి ఎప్పుడైతే బలపడుతోందని గ్రహించారో అప్పటి నుంచి ప్రతి విడతలోనూ మత రాజకీయాలను గుప్పిస్తూ..ప్రజలలో మత విద్వేషాలు రెచ్చగొట్టే లా ఉంటున్నాయి ఆయన వ్యాఖ్యలు. అందుకే వికసిత్ నినాదాలు పక్కన పడేసి మైనారిటీ రిజర్వేషన్ల మీద అక్కసు వెళ్లగక్కారు. అది కూడా లాభం లేదని గ్రహించి తాము మైనారిటీ వర్గాలకు వ్యతిరేకం కాదంటూ కవరింగ్ చేస్తూ వచ్చారు.
మొదట్లో..సంక్షేమ పథకాల ప్రచారం
గత దశాబ్దకాలంలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని మోదీ ఎన్నికల ప్రచార సభల్లో మొదట్లో చెబుతూ వచ్చారు. నీతి అయోగ్ అంచనాల ప్రకారం గత పదేళ్ల కాలంలో రైతులు, యువత, మహిళల ప్రస్తావన తెస్తూ ప్రసంగాలు చేస్తూ వచ్చారు. ఇక సబ్సిడీ సిలిండర్లు, 33 శాతం రిజర్వేషన్లు వచ్చారు. అయితే నిరుద్యోగం, రైతు ఉత్పత్తులకు మద్దతు ధర లాంటి విషయాలను ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. అయితే మొదట్లో వికసిత్ నినాదాలతో మొదలెట్టిన ప్రచారం చివరి దశకు వచ్చేసరికి విద్వేషిత భారత్ గా తయారయింది అంటూ ప్రతిపక్షాలు మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. పైగా ఇటీవల విపక్షాలపై చవకబారు నినాదాలు చేసి చులకనగా మారారు. ప్రధాని స్థాయిలో మాట్లాడే మాటలు కావవి అంటున్నారు విమర్శకులు.
ప్రధాని నరేంద్రమోదీ ముస్లింల కోసం విపక్షాలు ‘ముజ్రా’ డ్యాన్స్ చేస్తాయంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. ప్రతిపక్ష నేతలు మోదీపై విరుచుకుపడుతున్నారు. తుది దశ పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధానిలో ఆందోళన కనిపిస్తున్నదని, అందుకే మోదీ చవకబారు ఉపన్యాసాలకు సైతం వెనుకాడటం లేదని విమర్శిస్తున్నారు.
నీరుగారుతున్న మోదీ నినాదాలు
‘మోదీ గ్యారెంటీ’, ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదాలు క్రమంగా నీరుకారిపోతున్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. విపక్ష నేతలపై ప్రధాని తన స్థాయి మరిచి దిగజారి చేస్తున్న విమర్శలపై పౌర సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఆయన ఢిల్లీ నేతలా కాకుండా గల్లీ లీడర్‌లా ఓట్ల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రజాస్వామికవాదులు సైతం మండిపడుతున్నారు. భారత్ భూభాగాలను చైనా ఆక్రమించింది. ఇక్కడ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. అయినా.. దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీ 56 ఇంచుల ఛాతీ ఎక్కడ ఉన్నది?’ అని ఖర్గే ప్రశ్నించారు. మోదీ ‘ముజ్రా’ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఉపయోగించదగిన భాషేనా ఇది? అని ప్రశ్నించారు. ‘చైనా మన భూభాగాన్ని సుమారు 2 వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించింది. కానీ ఆ విషయంలో మోదీ ఏమీ చేయలేదు. నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆక్రమణల అంశంలో స్పందించకుండా ఆయనేమైనా డిస్కో డ్యాన్స్ చేస్తున్నారా?’ అంటూ ఎద్దేవా చేశారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ స్పందిస్తూ.. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడే ప్రసంగాలు తడబడుతాయని అన్నారు.
చేటు తెస్తున్న ముజ్రా మాటలు
ఈ పదేళ్ల కాలంలో బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు కొంతమంది కార్పొరేటర్లకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం, రైతులను, నిరుద్యోగులను, మహిళల భద్రత, కనీస మద్దతు ధర, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వంటివి 2024లో ఈసారి 400లకు పైనే (అబ్ కీ బార్ 400 పార్) నినాదాన్ని అధిగమించాయని ఆరు దశల పోలింగ్ సరళిని బట్టి రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు చెబుతున్నారు. అందుకే మోదీ ఈ ఫస్ట్రేషన్‌లోనే విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు, వారిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రచారంలో ‘ముజ్రా’ వంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు.పదేళ్ల పాలనా వైఫల్యాలు, బీజేపీ నేతల అబద్ధాలను ఎండగట్టడంలో విపక్ష నేతలు విజయవంతమయ్యారనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. భావోద్వేగాల ద్వారా ఓట్లు దక్కించుకోవాలనే వారి వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. వారి విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూనే సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అందుకే ఈసారి ప్రజల ఆలోచనలోనూ మార్పు వచ్చిందని, బీజేపీ నినాదాల కంటే వాస్తవాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. దానికి అగుణంగానే తమ తీర్పును చెప్పబోతున్నారని తెలుస్తోంది. మళ్లీ మోదీ వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమే అనేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయి. అందుకే 2014, 2019 నాటి నినాదాలు ఇప్పుడు పనిచేయబోవడం లేదని తేలిపోతున్నదని అంటున్నారు.