- ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్
- పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఓటేసిన మోదీ
- భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపు
- అధిక ఓట్లు వేసి సరికొత్త రికార్డు సృష్టించాలని వినతి
Modi: ప్రధాని మోదీ గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్ లో ఓటేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. గాంధీనగర్ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు. అంతకుముందు సార్వత్రిక సమరం మూడో విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన తన మద్దతుదారులను ఓటేసిన అనంతరం మోదీ పలకరించారు. అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని మరోసారి కోరారు మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఇప్పటికే సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 25 సీట్లకు మంగళవారం పోలింగ్ జరిగింది.